సూర్య ప్రతాపం.. ప్లేఆఫ్స్‌కు ముంబై

Mumbai Indians Won By 5 Wickets Against RCB - Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీపై విజయం సాధించిన ముంబై ఈ సీజన్‌లో  ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ముంబై తాను ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, నాలుగు ఓటములతో 16 పాయింట్లు సాధించి దర్జాగా ప్లేఆఫ్‌ చేరింది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై(10 సార్లు) తర్వాత కనీసం 9సార్లు ప్లే ఆఫ్‌ చేరిన జట్టుగా ముంబై రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆర్‌సీబీ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో చేధించింది. ముంబై బ్యాట్స్‌మన్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 79 పరుగులు(10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్‌ స్కోరర్‌గా నిలచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, ఓపెనర్లు డికాక్‌ 18, ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్‌, చాహల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకముందు టాస్‌ గెలిచిన ముంబై ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఆర్‌సీబీఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌, జోష్‌ పిలిప్‌లు ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇద్దరు బ్యాట్‌ ఝులిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 6ఓవర్లో 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 71 పరుగులకు చేరగానే జోష్‌ పిలిప్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వేగంగా ఇన్నింగ్స్‌ ఆడిన దేవదూత్‌ పడిక్కల్‌ కొన్ని చక్కని షాట్లు ఆడి  30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా కెప్టెన్‌ కోహ్లి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఏబీ డివిలియర్స్‌ వచ్చీ రాగానే ఫోర్, సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించినా జట్టు స్కోరు  పొలార్డ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఒకపక్క వికెట్లు పడుతున్నా దేవదూత్‌ వేగంగా ఆడడంతో ఏ దశలోనూ రన్‌రేట్‌ 8కి తక్కువగా నమోదు కాలేదు.

దీంతో ఆర్‌సీబీ 15 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆర్‌సీబీకి పరుగులు రావడం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శివమ్‌ మావితో పాటు 45 బంతుల్లో 74 పరుగులు చేసిన పడిక్కల్‌ ఒకే ఓవర్లో వెనుదిరిగారు. తర్వాత వచ్చిన క్రిస్‌ మోరిస్‌ విఫలం కావడం.. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 10 పరుగులు, గురుకీరత్‌ 14 పరుగుల చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకోగా, బౌల్ట్‌ , పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top