కేకేఆర్‌ను ఈజీగా కొట్టేశారు..

Mumbai Indians Beat KKR By 8 Wickets - Sakshi

అబుదాబి:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌  8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 149 పరుగుల టార్గెట్‌ను ముంబై 16.5 ఓవర్లలోనే కొట్టేసింది.  డీకాక్‌(78 నాటౌట్‌; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ముంబై సునాయాసంగా గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, డీకాక్‌లు ధాటిగా ఆరంభించారు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. దాంతో ముంబై ఇండియన్స్‌ పవర్‌ ప్లే ముగిసే సరికి 51 పరుగులు చేసింది. పవర్‌ ప్లే ముగిసిన తర్వాత కూడా వీరు ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలోనే డీకాక్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.  ఇది డీకాక్‌కు గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడో హాఫ్‌ సెంచరీగా నమోదైంది. అయితే 10.3 ఓవర్లలో ముంబై  94 పరుగుల వద్ద ఉండగా రోహిత్‌ శర్మ(35; 36 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. శివం మావి బౌలింగ్‌లో కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి సూర్యకుమార్‌ యాదవ్‌(10; 10 బంతుల్లో 1 ఫోర్‌) పెవిలియన్‌కు చేరాడు. వరుణ్‌ చక్రవర్తిల బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బౌల్డ్‌ అయ్యాడు. అటు తర్వాత హార్దిక్‌ పాండ్యా(21 నాటౌట్‌; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)-డీకాక్‌లు మిగతా పనిని పూర్తిచేశారు. ఇది ముంబైకు ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు నాల్గో ఓటమి. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. మరొకవైపు ఇరుజట్లు తలపడిన చివరి 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు ముంబైనే విజయం వరించడం విశేషం.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌(53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ ఈ మాత్రం స్కోరును బోర్డుపై ఉంచకల్గింది.  ప్రధానంగా కమిన్స్‌ మెరుపులతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరును చేయకల్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(7) నిరాశపరిచాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  ఆపై కాసేపటికి నితీష్‌ రాణా(5) కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. కౌల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్‌ పట్టడంతో రాణా ఔటయ్యాడు.  ఆపై శుబ్‌మన్‌ గిల్‌(21; 23 బంతుల్లో  2ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఇక దినేశ్‌ కార్తీక్‌(4) అనవసరపు షాట్‌కు యత్నించి బౌల్డ్‌ అయ్యాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడబోయి బౌల్డ్‌గా నిష్క్రమించాడు. కేకేఆర్‌ 42 పరుగుల వద్ద ఉండగా గిల్‌, కార్తీక్‌లు ఔట్‌ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. కాసేపటికి రసెల్‌(12) మళ్లీ విఫలం అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి రసెల్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో కేకేఆర్‌ 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 

కేకేఆర్‌ కష్టాల్లో పడ్డ సమయంలో మోర్గాన్‌కు కమిన్స్‌ జత కలిశాడు. వీరిద్దరూ జత కలిసిన తర్వాత కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ముందుగా సాగింది. ఈ జోడి వికెట్‌ ఇవ్వకూడదన్న లక్ష్యంతో క్రీజ్‌లో పోరాడారు. మోర్గాన్‌ మెల్లగా ఆడినా కమిన్స్‌ మాత్రం మెరుపులు మెరిపించాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు కమిన్స్‌. ఇది ఐపీఎల్‌లో కమిన్స్‌కు తొలి హాఫ్‌ సెంచరీ. ఇక మోర్గాన్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో  అజేయంగా 39 పరుగులు సాధించాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో ఈ జోడి 21 పరుగులు పిండుకుంది.  ఇందులో మోర్గాన్‌ రెండు సిక్స్‌లు కొట్టగా, కమిన్స్‌ ఫోర్‌ కొట్టాడు. దాంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top