కమిన్స్‌ మెరుపులు.. | Cummins Half Century Helps KKR To 148 Runs | Sakshi
Sakshi News home page

కమిన్స్‌ మెరుపులు..

Oct 16 2020 9:18 PM | Updated on Oct 16 2020 9:22 PM

Cummins Half Century Helps KKR To 148 Runs - Sakshi

అబుదాబి:  ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌(53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ ఈ మాత్రం స్కోరును బోర్డుపై ఉంచకల్గింది.  ప్రధానంగా కమిన్స్‌ మెరుపులతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరును చేయకల్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(7) నిరాశపరిచాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  

ఆపై కాసేపటికి నితీష్‌ రాణా(5) కూడా పెవిలియన్‌ బాటపట్టాడు. కౌల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్‌ పట్టడంతో రాణా ఔటయ్యాడు.  ఆపై శుబ్‌మన్‌ గిల్‌(21; 23 బంతుల్లో  2ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఇక దినేశ్‌ కార్తీక్‌(4) అనవసరపు షాట్‌కు యత్నించి బౌల్డ్‌ అయ్యాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో స్వీప్‌ షాట్‌ ఆడబోయి బౌల్డ్‌గా నిష్క్రమించాడు. కేకేఆర్‌ 42 పరుగుల వద్ద ఉండగా గిల్‌, కార్తీక్‌లు ఔట్‌ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. కాసేపటికి రసెల్‌(12) మళ్లీ విఫలం అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి రసెల్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో కేకేఆర్‌ 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 

మెరిసిన కమిన్స్‌
కేకేఆర్‌ కష్టాల్లో పడ్డ సమయంలో మోర్గాన్‌కు కమిన్స్‌ జత కలిశాడు. వీరిద్దరూ జత కలిసిన తర్వాత కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ముందుగా సాగింది. ఈ జోడి వికెట్‌ ఇవ్వకూడదన్న లక్ష్యంతో క్రీజ్‌లో పోరాడారు. మోర్గాన్‌ మెల్లగా ఆడినా కమిన్స్‌ మాత్రం మెరుపులు మెరిపించాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు కమిన్స్‌. ఇది ఐపీఎల్‌లో కమిన్స్‌కు తొలి హాఫ్‌ సెంచరీ. ఇక మోర్గాన్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో  అజేయంగా 39 పరుగులు సాధించాడు. వీరు 87 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో ఈ జోడి 21 పరుగులు పిండుకుంది.  ఇందులో మోర్గాన్‌ రెండు సిక్స్‌లు కొట్టగా, కమిన్స్‌ ఫోర్‌ కొట్టాడు. దాంతో కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్‌ చహర్‌ రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, కౌల్టర్‌ నైల్‌, బౌల్ట్‌లు తలో వికెట్‌ సాధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement