
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి చోటు దక్కని విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ సమస్యలను కారణంగా చూపుతూ సెలెక్టర్లు అతన్ని గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంచుతున్నారు. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన షమీ.. ఆతర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు, తాజాగా ఆసియా కప్‌కు ఎంపిక కాలేదు.
ఆసియా కప్ బెర్త్‌పై చాలా ఆశలు పెట్టుకున్న షమీ.. సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో, దేశవాలీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ బరిలో దిగాడు. ఈ టోర్నీలో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. నార్త్ జోన్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) ప్రారంభమైన మ్యాచ్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు.
తొలి రోజు ఆటలో 17 ఓవర్లు వేసి 3.20 ఎకానమీతో 55 పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. ఇందులో 4 మెయిడిన్లు ఉన్నాయి. తొలి రెండు స్పెల్స్‌లో పెద్దగా ప్రభావం చూపని షమీ.. మూడో స్పెల్‌లో వికెట్ రాబట్టడంతో పాటు బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫునే బరిలోకి దిగిన మరో పేసర్ ముకేశ్ కుమార్ గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. ముకేశ్ 11.5 ఓవర్లు వేసిన తర్వాత అసౌకర్యానికి లోనై మైదానాన్ని వీడాడు. ఆతర్వాత అతను తిరిగి బౌలింగ్‌కు రాలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. జట్టులో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోయినా స్కోర్ 300 పరుగులు దాటింది. ఆయుశ్ బదోని అత్యధికంగా 63 పరుగులు చేయగా.. షుభమ్ ఖజూరియా 26, కెప్టెన్ అంకిత్ కుమార్ 30, యశ్ ధుల్ 39, నిషాంత్ సింధు 47, సిహిల్ లోత్రా 19 పరుగులు చేశారు. కన్హయ్య 42, మయాంక్ డాగర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో మనిశి 3 వికెట్లు తీయగా.. షమీ, సూరజ్ జైస్వాల్, ముక్తర్ హుసేన్ తలో వికెట్ తీశారు.