
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గత కొంత కాలంగా ఫిట్ సమస్యలతో సతమతవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు భారత జట్టులో కీలక సభ్యునిగా ఉన్న షమీ.. ఇప్పుడు పూర్తిగా టీమ్‌లోనే చోటు కోల్పోయాడు. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరపున ఆడాడు.
ఆ తర్వాత ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. భారీగా పరుగులు సమర్పించుకుంటూ వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించాడు. దీంతో కొన్ని మ్యాచ్‌లకు ఈ రైట్ ఆర్మ్ స్పీడ్ స్టార్‌ను ఎస్ఆర్‌హెచ్ బెంచ్‌కే పరిమితం చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు షమీని ఎంపిక చేస్తారని అంతా భావించారు.
కానీ అజిత్ అగార్కకర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ షమీని పరిగణలోకి తీసుకోలేదు. అతడి స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ యువ పేసర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత ఆసియాకప్-2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా షమీకి చోటు దక్కలేదు. దీంతో అతడు త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై షమీ స్పందించాడు. తనకు ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని షమీ చెప్పుకొచ్చాడు.
నేను క్రికెట్‌లో కొనసాగడం ఎవరికైనా సమస్యగా ఉందా? నేను రిటైర్‌మెంట్ తీసుకుంటే వారి జీవితాలు బాగుపడతాయంటే నాతో చెప్పండి. అప్పుడు ఆలోచిద్దాం. నేను రిటైర్మెంట్ తీసుకోవాలని మీరు కోరుకునేంతగా నేను ఏమి తప్పు చేశాను? నేను ఎప్పుడైతే ఆటపై విసుగు చెందుతానో.. అప్పుడు ఇక చాలు అని నా కెరీర్‌ను ముగిస్తాను.
నన్ను జట్టుకు ఎంపిక చేయికపోయినా, నేను కష్టపడి పనిచేస్తూనే ఉంటాను. అంతర్జాతీయ క్రికె్‌లో అవకాశం దక్కకపోతే, దేశవాళీ క్రికెట్‌లో ఆడుతా. ఏదో ఒక చోట ఆడుతూనే ఉంటాను. మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఇలాంటి వాటి గురించి ఆలోచించండి. ఇప్పుడు నాకు మాత్రం రిటైర్మెంట్ గురించి ఆలోచించే సమయం లేదని"ఓ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపై షమీ స్పందించాడు.
నా కెరీర్‌లో అదొక్కటే లోటు..
"నాకు ఒకే ఒక కల మిగిలి ఉంది. అది వన్డే ప్రపంచ కప్ గెలవడం. అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తిరిగి భారత్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను తీసుకురావాలనుకుంటున్నాను. ప్రపంచకప్-2023 టైటిల్‌ను మేము తృటిలో చేజార్చుకున్నాము. ఆ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరాము.
ఆ సమయంలో మాకు నమ్మకంతో పాటు కాస్త భయం కూడా ఉండేది. వరుసగా గెలిచాము, నాకౌట్‌లో ఏమి అవుతుందో అని కాస్త ఆందోళన చెందాము. అయితే అభిమానుల ఉత్సాహం, దృడ సంకల్పంతో ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగాము. కానీ దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌లో దగ్గరగా వెళ్లి ఓడిపోయాము అని షమీ చెప్పుకొచ్చాడు. కాగా షమీ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్నాడు.
చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్ స్టార్ పేసర్