నబీ చెత్త రికార్డు | Mohammad Nabi Sets Unwanted Record: Most T20I Ducks for Afghanistan Player | Sakshi
Sakshi News home page

నబీ చెత్త రికార్డు

Oct 30 2025 12:36 PM | Updated on Oct 30 2025 1:02 PM

Mohammad Nabi enters list of shame for Afghanistan after T20I duck vs Zimbabwe

ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ (Mohammad Nabi) చెత్త రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక డకౌట్లైన ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. 40 ఏళ్ల నబీ 143 ఇన్నింగ్స్‌ల కెరీర్‌లో 9 సార్లు ఖాతా తెరవకుండా ఔటై, రహ్మానుల్లా గుర్భాజ్‌ను అధిగమించాడు. 

గుర్భాజ్‌ 78 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్‌లో 8 సార్లు డకౌటయ్యాడు. గుల్బదిన్‌ నైబ్‌, రషీద్‌ ఖాన్‌ తమతమ 67 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్‌లో తలో 7 సార్లు డకౌటయ్యారు. నిన్న (అక్టోబర్‌ 29) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నబీ ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నబీ 2 బంతుల్లో డకౌటయ్యాడు. నబీ డకౌటైనా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ ఓ మోస్తరుకు మించిన స్కోరే (180/6) చేసింది. అనంతరం దాన్ని విజయవంతంగా కాపాడుకొని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో ఇబ్రహీం జద్రాన్‌ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రహ్మానుల్లా గుర్బాజ్‌ (39), సెదిఖుల్లా అటల్‌ (25), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (27), షాహీదుల్లా (22 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.జింబాబ్వే బౌల‍ర్లలో సికందర్‌ రజా 3 వికెట్లతో సత్తా చాటగా.. బ్లెస్సింగ్‌ ముజరబానీ 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (3-0-20-4), ఒమర్‌జాయ్‌ (4-0-29-3), అహ్మద్‌జాయ్‌ (2.1-0-20-2) ధాటికి జింబాబ్వే 16.1 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు డకౌట్లయ్యారు. తొమ్మిదో నంబర్‌ ఆటగాడు మపోసా (32) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రెండో టీ20 అక్టోబర్‌ 31న జరుగనుంది.

చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement