
సంప్రదాయ క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కున్న ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్‌లో మరోసారి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఈ ఏడాది యాషెస్ సిరీస్ నవంబర్ నుంచి జనవరి 8, 2026 వరకు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.
ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు నెలల పైగా సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్‌లతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. "యాషెస్ సిరీస్‌లో జో రూట్ కనీసం ఒక సెంచరీ అయినా సాధించకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తా" అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బోల్డ్ ఛాలెంజ్‌పై హేడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్ స్పందించింది. "ప్లీజ్ రూట్ ఒక్కసెంచరీ చేయండి.. లేదంటే మా నాన్న అన్నంత పని చేస్తాడు" అని కామెంట్స్‌లో గ్రేస్ రాసుకొచ్చింది.
ఒక్క సెంచరీ కూడా..
వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై కనీసం ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఏ ఫార్మాట్‌లోనూ అతడు సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూట్ 14 టెస్ట్ మ్యాచ్‌లు, 16 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.
ఆసీస్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 91 నాటౌట్‌గా ఉంది. అయితే ఓవరాల్‌గా ఆసీస్‌పై రూట్‌కు మంచి రికార్డు ఉంది. రూట్ తన కరీర్‌లో కంగారులపై నాలుగు సెంచరీలు చేశాడు. అవన్నీ కూడా తన స్వదేశంలో వచ్చినవే కావడం గమానార్హం.