
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ మైక్ హసన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. హసన్ మెదడు పనిచేస్తుందో లేదో ఆ జట్టు స్పిన్నర్ మొహమ్మద్ నవాజే (Mohammad Nawaz)నిరూపించాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భాగంగా భారత్- పాక్ మధ్య మ్యాచ్ నిర్వహణకు ఆదివారం (సెప్టెంబరు 14) షెడ్యూల్ ఖరారైంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్
ఈసారి యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్తాన్ ఇప్పటికే చెరో విజయం సాధించాయి. తద్వారా గ్రూప్-‘ఎ’లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే.. దాయాదుల పోరు నేపథ్యంలో పాక్ హెడ్‌కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు.
ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీ దగ్గర ఆనంద్ బజార్ పత్రిక విలేకరి ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్.. ప్రపంచలోని అత్యుత్తమ స్పిన్నర్ మా జట్టులో ఉన్నాడు’’ అని అన్నాడు సదరు విలేకరి చెప్పగా.. ‘‘ఎవరా స్పిన్నర్?’’ అని దాదా అడిగాడు.
మెదడు ఉందా?.. లేదా?.. అతడే నిరూపించాలి
ఇందుకు బదులిస్తూ.. ‘‘మొహమ్మద్ నవాజ్’’ అని విలేకరి పేర్కొనగా.. ‘‘సరే.. తమ కోచ్ మెదడు సరిగ్గా పనిచేస్తుందని నిరూపించాల్సిన బాధ్యత సదరు స్పిన్నర్‌పైనే ఉంది’’ అంటూ గంగూలీ ఘాటుగా కౌంటర్‌గా ఇచ్చాడు.
వీళ్లంతా వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు
అదే విధంగా.. భారత్- పాక్ జట్ల మధ్య పోలికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘రెండు జట్లకు అసలు పోలికే లేదు. పాక్ జట్టు నాణ్యత రోజురోజుకీ దిగజారిపోతోంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మొహహ్మద్ యూసఫ్... వీళ్లంతా వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు.
కానీ పాకిస్తాన్‌కు ఇపుడు ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారో మీరే చూడండి. ఇక ఆ టీ20 జట్టులో బాబర్ ఆజం లేడు. మహ్మద్ రిజ్వాన్ కూడా లేడు. ఫఖర్ జమాన్ ఓకే. బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ ఫర్వాలేదు.
షాహిన్ ఎన్నటికీ వసీం అక్రం కాలేడు
కానీ టాలెంట్ విషయంలో షాహిన్ ఆఫ్రిది ఎన్నటికీ వసీం అక్రం కాలేడు కదా!.. వసీం, వకార్, షోయబ్‌లతో షాహిన్ లేదంటే రవూఫ్‌లను పోల్చగలమా? టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఏదేమైనా ప్రస్తుత టీమిండియా- పాక్ జట్లకు ఎలాంటి పోలికా లేదని స్పష్టంగా చెప్పగలను’’ అని గంగూలీ పేర్కొన్నాడు.