ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లి (Virat Kohli) విఫలమయ్యాడు. అడిలైడ్‌లో మంచి రికార్డు కలిగి ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గురువారం నాటి మ్యాచ్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు. అంతకు ముందు పెర్త్ వేదికగా తొలి వన్డేలోనూ ఈ దిగ్గజ ఆటగాడు సున్నా చుట్టడం గమనార్హం.
ఈ నేపథ్యంలో అడిలైడ్ వన్డేలో కోహ్లి అవుటై.. పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా కోహ్లి సైతం గ్లోవ్స్ తీసి.. ఇక సెలవు అన్నట్లుగా మైదానం వీడాడు. అయితే, కోహ్లి చర్య రిటైర్మెంట్‌కు సంకేతమంటూ వదంతులు వ్యాపించాయి.
రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన..
ఈ విషయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) స్పందించాడు. ‘‘వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. 14 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టుల్లోనూ 32 దాకా శతకాలు ఉన్నాయి. ఇప్పటికే వేలకు వేలు పరుగులు రాబట్టాడు.
అలాంటి ఆటగాడు వరుసగా రెండుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తప్పుపట్టాల్సిన అవసరం ఏమీలేదు. అతడిలో ఇంకా చాలా ఆట మిగిలే ఉంది. మున్ముందు ఇంకా ఆడతాడు. తదుపరి సిడ్నీ వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నిజానికి టెస్టు, వన్డేల్లో అడిలైడ్ కోహ్లికి ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ శతకాలు బాదిన చరిత్ర అతడికి ఉంది. కాబట్టి.. సహజంగానే ఈసారి వైఫల్యాన్ని అతడితో పాటు అభిమానులూ తట్టుకోలేకపోయారు. అయినా ఆటగాడి కెరీర్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.
ఆ స్పందన అమోఘం
ఏదేమైనా కోహ్లి మైదానాన్ని వీడుతున్న వేళ అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. వారంతా కూడా భారతీయ అభిమానులతో కలిసి కోహ్లికి ఓవియేషన్ ఇచ్చారు. గొప్ప ఆటగాడికి లభించే ఆదరణకు తార్కాణం అది.
ఇది చాలా చాలా ప్రత్యేకం. ఇదేమీ కోహ్లి కెరీర్‌కు ముగింపు కాదు. అతడు ఆటగాళ్లు కూర్చునే స్టాండ్ వైపు వెళ్లాడు. అయితే, తన పట్ల అభిమానం చూపుతున్న వారి కోసం మాత్రమే గ్లోవ్స్ తీసి వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడు
విరాట్ కోహ్లి.. అంత తేలికగా ఓటమిని ఒప్పుకొని ఆటను వదిలేసే రకం కాదు. వరుసగా రెండుసార్లు డకౌట్ అయిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. ఉన్నత స్థాయిలోనే అతడు ఆటకు వీడ్కోలు పలుకుతాడు.
సిడ్నీ మ్యాచ్ తర్వాత.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఉంది. ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి విరాట్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతాడనే భావిస్తున్నా. లేదంటే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌కూడా నిరాశ చెందుతారనడంలో సందేహం లేదు.
ఆ ఛాన్సే లేదు
ఏదేమైనా కోహ్లి తన పట్ల అభిమానం చూపిన వారికి కృతజ్ఞతగా మాత్రమే గ్లోవ్స్ తీశాడు. ఒకవేళ తను సెంచరీ చేసి ఉంటే బ్యాట్ ఎత్తి అభివాదం చేసేవాడు. కాబట్టి కోహ్లి రిటైర్మెంట్ అంటూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని గావస్కర్ స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.
కాగా పెర్త్ వన్డేలో ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అడిలైడ్‌లో రెండు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల, టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: IND vs AUS: టీమిండియా కొంపముంచిన 22 ఏళ్ల కుర్రాడు
A tough day for the King of Cricket 👑@imVkohli waved goodbye to the Adelaide crowd 🏏💬#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/yAG1uQFPA8
— Star Sports (@StarSportsIndia) October 23, 2025


