
టీమిండియా తరఫున పునరాగమనంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్రంగా నిరాశపరిచారు. చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 బరిలో దిగిన రో-కో తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేయగా.. కోహ్లి మరీ ఘోరంగా విఫలమయ్యాడు.
ఎనిమిది బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు కోహ్లి. ఆసీస్‌తో వన్డేల్లో కోహ్లి ఇలా సున్నా చుట్టడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan).. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఆట తీరును విమర్శించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) నాటి కోహ్లి వైఫల్యాలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నాడు.
ఆ వైఫల్యాలే వెంటాడుతున్నాయి.. ఇలా అయితే కష్టం
కాగా బీజీటీ టెస్టు సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడబోయి దాదాపు ఎనిమిదిసార్లు అవుటైన విషయం తెలిసిందే. మరోవైపు.. రోహిత్ కూడా నాటి సిరీస్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఈ ఇద్దరు ఇప్పుడు సరికొత్తగా తిరిగివచ్చారు. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
ఇక ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లి నెట్స్‌లో చెమటోడ్చి ఆస్ట్రేలియాకు చేరుకోగా.. రోహిత్ ఏకంగా పది కిలోల మేర బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. అయితే, ఇద్దరూ రీఎంట్రీలో విఫలం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..
‘‘ఫిట్‌నెస్ వేరు. మ్యాచ్ ఫిట్‌నెస్ వేరు. ఆసీస్‌తో తొలి వన్డేలో పరుగులు రాబట్టేందుకు రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇక విరాట్‌కేమో బీజీటీ కష్టాలు మళ్లీ తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అడిలైడ్, సిడ్నీ వన్డేల్లో మాత్రం వీరు కచ్చితంగా లోపాలను అధిగమించి సత్తా చాటుతారనే ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ఉత్తమం
ఇక తొలి వన్డేలో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించేటపుడు.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ఉత్తమం.
నేరుగా వెళ్లి మ్యాచ్‌లు ఆడటం అంటే.. టీమిండియాకు కఠిన సవాలే. అక్కడి పిచ్ పరిస్థితులకు అంత తేలికగా అలవాటుపడలేము. బౌన్సీ పిచ్‌లు మనల్ని పరీక్షిస్తాయి. మన బౌలర్లు తొలి వన్డేలో సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయారు. ఇకనైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికాడు.
చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి