అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్ ఆరోపించారు. కేరళలో పర్యటించి మ్యాచ్ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్‌కు స్పాన్సర్ల ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు.
మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్ డిమాండ్ చేశాడు. గత డిసెంబర్‌లో మెస్సీ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా, హైదరాబాద్‌లో మెస్సీ బృందం ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది.
కాగా ఈ ఏడాది జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిఫా 48 జట్లతో కూడిన వివరాలను, మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా రెండురోజుల క్రితం ఫిఫా ప్రపంచకప్ కోసం అర్జెంటీనా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతు న్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జాంబియాతో ఆడిన మ్యాచ్ మెస్సీకి చివరిదనే ప్రచారం జరిగిన వేళ.. మైదానంలోనే మెస్సీ కంటతడి పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.


