
టీమిండియాకు దొరికిన అదురైన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఒకడు. అండర్-19 ప్రపంచకప్-2014లో భారత్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లో పద్నాలుగు వికెట్లు కూల్చి వెలుగులోకి వచ్చాడీ కాన్పూర్ ‘కుర్రాడు’. ఆ తర్వాత దేశీ క్రికెట్లో, ఐపీఎల్‌లో రాణించి టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
మ్యాచ్ విన్నర్
చైనామన్ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇప్పటికే మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. గతేడాది సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ (IND vs ENG)ను భారత్ 4-1తో గెలవడంలో కుల్దీప్‌ది కీలక పాత్ర. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను టీమిండియా సొంతం చేసుకోవడంలోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు.
అయినప్పటికీ చాన్నాళ్లుగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. మార్చిలో చివరగా టీమిండియాకు ఆడిన కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో పునరాగమనం చేసే అవకాశం ఉంది.
ఇంగ్లండ్‌లో ఆడిస్తే గెలిచేవాళ్లం
అయితే, ఈ టీ20 టోర్నీలోనూ కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని.. భారత మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అంటున్నాడు. ‘‘ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే.. టీమిండియా 3-1తో గెలిచేది.
కుల్దీప్ లాంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. ఇంగ్లిష్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో ఇబ్బందిపడేవారు. అతడి గూగ్లీలను వాళ్లు రీడ్ చేయలేకపోయేవారు. తొలి టెస్టులో వాళ్లు 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఆ సమయంలో కుల్దీప్ గనుక మైదానంలో ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదు.
ఈసారి కూడా బెంచ్ మీదే!
ఇక ఆసియా కప్ టోర్నీలోనూ ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఆడించాలని భావిస్తే.. మేనేజ్‌మెంట్ కుల్దీప్ యాదవ్‌ను ఈసారి కూడా పక్కనపెట్టవచ్చు. వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారు. బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి అక్షర్ పటేల్‌ను తీసుకుంటారు’’ అని మణిందర్ సింగ్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.
కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్‌లో పర్యటించిన టీమిండియా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ టూర్‌తోనే శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ప్రయాణం ఆరంభించాడు. బౌలింగ్ దళంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ కీలకంగా వ్యవహరించగా.. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటాడు.
చదవండి: ఒక్కరికే మద్దతు.. అందుకే గిల్‌కు టీ20 జట్టులో చోటు: ఊతప్ప