
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయడంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు జట్టు ప్రకటన సందర్భంగా గిల్‌కు చోటివ్వడంతో పాటు.. అతడిని వైస్ కెప్టెన్‌గానూ నియమించినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
ఓపెనర్‌గానే గిల్!
కాగా దాదాపు ఏడాది పాటు భారత టీ20 జట్టుకు గిల్ దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి సత్తా చాటారు. అయితే, గిల్ రీఎంట్రీ సంజూకు గండంగా మారింది. అభిషేక్ శర్మనే ఓపెనర్‌గా కొనసాగిస్తామని అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
అంతేకాదు.. గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్‌గా వచ్చాడని అగార్కర్ పేర్కొన్నాడు. దీనిని బట్టి గిల్ కోసం సంజూపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా కాకపోయినా వికెట్ కీపర్‌గా అయినా ఈ కేరళ స్టార్‌ను ఆడిస్తారనుకుంటే.. యాజమాన్యం జితేశ శర్మ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
ఒక ఆటగాడిని అలా తయారు చేస్తారు
ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్ అయిన గిల్‌ను.. టీ20, వన్డేల్లోనూ భవిష్య కెప్టెన్‌గా నియమించేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోందని మరికొందరు పేర్కొంటున్నారు. అయితే, భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప మాత్రం భిన్నంగా స్పందించాడు.
‘‘భారత క్రికెట్‌లో పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే.. ప్రతి తరంలోనూ ఒక సూపర్‌స్టార్‌ను తయారు చేస్తారు. భారత క్రికెట్‌ను కాపాడేందుకు ఎవరో ఒక ప్లేయర్‌కు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూనే ఉంటారు.
మార్కెటింగ్, వ్యాపారం కోసమే
ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మార్కెటింగ్, వ్యాపారం కోసం ఇలాంటి నిర్ణయాలు జరుగుతాయి. అతడిని అందుకే ఇప్పుడు టీ20 జట్టులోకి తిరిగి తీసుకువచ్చారు. అలాంటి సూపర్‌స్టార్లతో ఆటను ముందుకు తీసుకువెళ్లాలనే ప్లాన్. శుబ్‌మన్ గిల్ కూడా సూపర్‌స్టార్లలో ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఈ ఖండాంతర టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, యూఏఈ, హాంగ్‌కాంగ్, ఒమన్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. సరికొత్త చరిత్ర