
ఆఫ్ఘనిస్టాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజం టిమ్ సౌథీని వెనక్కు నెట్టాడు.
నిన్న (సెప్టెంబర్ 1) యూఏఈతో (ముక్కోణపు సిరీస్) జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో ఈ ఘనత సాధించాడు. సౌథీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ 98 మ్యాచ్‌ల్లోనే అతన్ని అధిగమించాడు. ప్రస్తుతం రషీద్ ఖాతాలో 165 వికెట్లు ఉన్నాయి.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్ల జాబితాలో రషీద్, సౌథీ తర్వాతి స్థానాల్లో ఐష్ సోధి (150), షకీబ్ అల్ హసన్ (149), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (142), ఆదిల్ రషీద్ (135), వనిందు హసరంగ (131), ఆడమ్ జంపా (130), మార్క్ అదైర్ (128), ఎషాన్ ఖాన్ (127) ఉన్నారు.
ఈ విభాగం టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేకపోవడం విచారకరం. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్షదీప్ సింగ్ (99) ఉన్నాడు. అర్షదీప్ తర్వాతి స్థానాల్లో యుజ్వేంద్ర చహల్ (96), హార్దిక్ పాండ్యా (94) టాప్-3లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సెదీఖుల్లా అటల్ (40 బంతుల్లో 54), ఇబ్రహాం జద్రాన్ (40 బంతుల్లో 63), అజ్మతుల్లా (12 బంతుల్లో 20 నాటౌట్), కరీమ్ జనత్ (10 బంతుల్లో 23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. రషీద్ ఖాన్ (4-0-21-3), షరాఫుద్దీన్ అష్రఫ్ (4-0-24-3) ధాటికి 150 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ముహమ్మద్ వసీం (37 బంతుల్లో 67), వికెట్‌కీపర్ రాహుల్ చోప్రా (35 బంతుల్లో 52 నాటౌట్) యూఏఈని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ మిగతా వారి నుంచి వారికి సహకారం లభించలేదు.
ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే తొలి విజయం. యూఏఈ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ టోర్నీలో మరో జట్టు పాక్ వరుసగా రెండు విజయాలు (ఆఫ్ఘన్, యూఏఈ) సాధించింది. ఇవాళ పాక్, ఆఫ్ఘనిస్తాన్ మరోసారి తలపడనున్నాయి.