మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ (New Zealand vs England) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England) సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలర్లు, స్వల్ప ఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆడుతూ పాడుతూ గెలుపుతీరాలు చేరింది.
ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇదివరకే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్ ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగింది.
చెలరేగిన బౌలర్లు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు.
సత్తా చాటిన జోన్స్
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ యామీ జోన్స్ (86 నాటౌట్) సత్తా చాటడంతో 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ (40), హీథర్ నైట్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్, లియా తహుహు తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.
చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!


