
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం దుబాయ్ పయనం కానుంది. నాలుగు రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో టీమిండియా చెమటోడ్చనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్టు తరపున సంజూ శాంసన్‌కు ఆడే అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇన్నాళ్లు ఓపెనర్‌గా ఆడిన శాంసన్‌కు శుబ్‌మన్ గిల్ రీఎంట్రీతో తుది జట్టులో చోటుపై సందేహం నెలకొంది. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి టీమ్ మెనెజ్‌మెంట్ గిల్ వైపే మొగ్గు చూపే అవకాశముంది. భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్‌తో పాటు గిల్ ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.
ఒకవేళ శాంసన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని భావిస్తే అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. లేదంటే అతడి స్ధానంలో వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడం ఖాయం. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు దీప్ దాస్ గుప్తా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత తుది జట్టులో సంజూకు చోటు కష్టమేనని అతడు అన్నాడు.
"టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ ప్రారంభిస్తాడని అనుకుంటున్నాను. అతడు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నందున కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడు. అంతేకాకుండా రెట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబనేషన్ కూడా సరిగ్గా సరిపోతుంది. ఇక మూడో స్ధానంలో కెప్టెన్ సూర్యకుమార్, నాలుగో స్ధానంలో తిలక్ వర్మ రానున్నారు. ఈ రెండు స్ధానాల్లో ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ లేవని భావిస్తున్నాను.
మరోసారి లెఫ్ట్-హ్యాండ్, రైట్-హ్యాండ్ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతోంది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేష్ శర్మకు అవకాశమివ్వాలని నేను సూచిస్తాను. సంజూ శాంసన్ కంటే అతడు బెటర్ ఆప్షన్. జితేష్ ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి జట్టుకు మంచి ఫినిష్‌ను అందించగలడు.
అదే శాంసన్ అయితే టాపర్డర్‌లో మాత్రమే ఆడగలడు. కాబట్టి సంజూ కంటే జితేష్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని" రేవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుప్తా పేర్కొన్నాడు.
ఆసియాకప్-2025కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కులదీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ సింగ్ రానా
చదవండి: ఎంత గొప్పగా ఆడినా ప్రయోజనం ఉండదు.. అంతా సెలక్టర్ల ఇష్టం: భువీ