
PC: BCCI
‘స్వింగ్ సుల్తాన్’ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) టీమిండియాకు ఆడి దాదాపు మూడేళ్లు అవుతోంది. న్యూజిలాండ్ గడ్డ మీద 2022లో భువీ భారత్ తరఫున చివరగా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగాడు. ఆ తర్వాత అతడికి జట్టులో చోటు కరువైంది.
పోటీలో వెనుకబడిన భువీ
టీ20 ప్రపంచకప్-2022తో పాటు న్యూజిలాండ్ పర్యటనలో విఫలం కావడమే ఇందుకు కారణం. ఓవైపు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో భువీ పునరాగమనం చేయలేకపోయాడు. ఐపీఎల్‌తో పాటు ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ వంటి టోర్నీల్లో రాణించినా ఈ రైటార్మ్ పేసర్ పేరును టీమిండియా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో జాతీయ జట్టుకు దూరం కావడంపై భువనేశ్వర్ కుమార్ తాజాగా స్పందించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఒక్కోసారి భంగపాటు తప్పదని.. అంతా సెలక్టర్ల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నాడు. కాగా భువీ ప్రస్తుతం యూపీ టీ20 లీగ్‌తో బిజీగా ఉన్నాడు. లక్నో ఫాల్కన్స్ జట్టుకు 35 ఏళ్ల ఈ బౌలర్ కెప్టెన్‌గా ఉన్నాడు.
అదొక్కటే నా చేతుల్లో ఉంది
ఈ క్రమంలో లీగ్ సందర్భంగా దైనిక్ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘మీ ప్రశ్నలకు సెలక్టర్లు మాత్రమే సమాధానం చెప్పగలరు. మైదానంలో వందకు వంద శాతం కష్టపడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది.
ప్రస్తుతం నేను అదే పనిచేస్తున్నాను. యూపీ లీగ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తరఫున ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే ఫార్మాట్లో ఆడే అవకాశం వస్తే.. అక్కడా అత్తుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
అంతా సెలక్టర్ల ఇష్టం
క్రమశిక్షణ బౌలర్‌గా నా దృష్టి మొత్తం ఫిట్‌నెస్, లైన్ అండ్ లెంగ్త్ మీదే ఉంటుంది. ఒక్కోసారి ఎంత గొప్పగా ఆడినా.. అదృష్టం కూడా కలిసి రావాలి. ఒకవేళ మన ప్రదర్శన గొప్పగా ఉండి.. నిలకడగా ఆడుతూ ఉంటే.. ఎవరూ మనల్ని ఎంతో కాలం పట్టించుకోకుండా ఉండలేరు కదా!
అప్పుడు.. ఒకవేళ సెలక్ట్ చేయకపోయినా.. మరేం పర్లేదు.. ఆట మీదే మన దృష్టి ఉండాలి. ఇక ఆపై అంతా సెలక్టర్ల ఇష్టం’’ అని భువనేశ్వర్ కుమార్ పరోక్షంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.
కాగా 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భువీ.. ఇప్పటి వరకు 121 వన్డేల్లో 141... 21 టెస్టుల్లో 63... 87 అంతర్జాతీయ టీ20లలో 90 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్‌లో 190 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భువీ.. 198 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ లీడింగ్ వికెట్ టేకర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
చదవండి: సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్