
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవి చూసింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
వెంకటేశ్ అయ్యర్ (21 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ రాణా (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆరోరా, రస్సెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా తొలి బంతినే నరైన్‌కు అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్‌గా సంధించాడు.
బుమ్రా వేసిన బంతికి నరైన్ దగ్గర సమధానమే లేకుండా పోయింది. నరైన్ బ్యాట్ కిందకు దించే లోపే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన నరైన్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు వరల్డ్‌క్రికెట్‌లో యార్కర్ల కింగ్ అంటూ బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
Jasprit Bumrah is my happiness.pic.twitter.com/wvLPZSbhs5
— R A T N I S H (@LoyalSachinFan) May 11, 2024