
నేడు తొలి వన్డే
గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్
రోహిత్, కోహ్లిలపై అందరి దృష్టి
ఉ.గం.9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ఆసియా కప్ టి20ల్లో అజేయంగా ట్రోఫీ గెలుపు, అంతకు ముందు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన...ఇప్పుడు కొంత విరామానంతరం భారత జట్టు మూడో ఫార్మాట్‌లో పెద్ద టీమ్‌తో సమరానికి సిద్ధమైంది. ఈ సారి ఎదురుగా ఉంది వన్డే ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. ఆసీస్ గడ్డపైనే జరిగే ఈ మూడు వన్డేల పోరులో పైచేయి సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
కొత్త కెప్టెన్ గిల్ నేతృత్వంలో ఈ సమరానికి భారత్ సిద్ధం కాగా... ఈ ఫార్మాట్‌లో ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల ఆటపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా...ఆసీస్ తమ స్వదేశంలో పటిష్టమైన బలగంతోనే బరిలోకి దిగుతోంది.
పెర్త్: చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మధ్య నేడు (ఆదివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు చివరిసారిగా తలపడిన వన్డేలో (చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్) భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియాకు సంబంధించి కెప్టెన్ గా శుబ్‌మన్ గిల్ రావడం ప్రధాన మార్పు కాగా...గాయంతో ప్యాట్ కమిన్స్ తప్పుకోవడంతో మిచెల్ మార్ష్ ఆసీస్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు.
ఆటగాళ్లంతా ఫామ్‌లో...
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ 2027 వరల్డ్ కప్ జట్టు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా...దానికి చాలా సమయం ఉందని కోచ్ గంభీర్ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఏమిటో సగటు క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. ఈ సిరీస్ గెలిచినా గెలవకపోయినా స్టార్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్ ఎలా ఆడతారనేదే అన్నింటికంటే ముఖ్యం. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నా...ఇలాంటి అనుభవం పూర్తిగా భిన్నం.
వీరిద్దరు పరస్పర కెప్టెన్సీలో కాకుండా మరో సారథి (ధోని) నాయకత్వంలో ఆడి తొమ్మిదేళ్లయింది. ఇప్పుడు ఎంతో జూనియర్ అయిన గిల్ కెప్టెన్సీలో ఆడటంతో పాటు కచ్చితంగా రాణించాల్సిన స్థితిలో వీరిద్దరు ఉన్నారు. ఆట, అనుభవం విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, ఇక్కడా బాగా ఆడాలని అంతా కోరుకుంటున్నారు. ఇతర బ్యాటర్లలో గిల్, శ్రేయస్, రాహుల్ కీలకం కానున్నారు. వన్డే టీమ్‌లోనూ జట్టులో పలువురు ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు.
అక్షర్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో పాటు ఆంధ్ర ఆటగాడు నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖాయం. రెగ్యులర్ స్పిన్నర్‌గా కుల్దీప్ ఆడతాడు. బుమ్రా వన్డే సిరీస్‌కు లేకపోవడంతో ప్రధాన పేసర్‌గా సిరాజ్ బాధ్యతలు తీసుకోనుండగా, ఆసీస్ పరిస్థితులను బట్టి చూస్తే రెండో పేసర్‌గా ప్రసిధ్ లేదా అర్ష్ దీప్ లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. మొత్తంగా జట్టు అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తోంది.
కొత్త ఆటగాళ్లతో...
వేర్వేరు కారణాలతో పలువురు ఆస్ట్రేలియా రెగ్యులర్ వన్డే ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెన్‌షా, ఒవెన్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ టాప్ పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌తో పాటు కమిన్స్ గైర్హాజరు ఎలిస్‌కు అవకాశం ఇస్తోంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు హెడ్, మార్ష్తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ప్రభావితం చేయగలరు. మిగతా ప్రధాన బ్యాటర్లకు పెద్దగా అనుభవం లేకపోయినా సొంతగడ్డ అనుకూలత వారికి బలం కానుంది.
పిచ్, వాతావరణం
ఆప్టస్ స్టేడియం బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించే మైదానం కాదు. బౌలర్లే ప్రభావం చూపిస్తారు. గత ఆరేళ్లలో మూడు వన్డేలే జరగ్గా, అన్నింటిలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఆసీస్ ఇక్కడ ఆడిన మూడూ ఓడింది. మ్యాచ్‌కు స్వల్ప వర్ష సూచన ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్, రాహుల్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్,ప్రసిధ్/ అర్ష్ దీప్.
ఆ్రస్టేలియా: మార్ష్(కెప్టెన్), హెడ్, షార్ట్, రెన్‌షా, ఫిలిప్, ఒవెన్, కనోలీ, స్టార్క్, ఎలిస్, కునెమన్,హాజల్‌వుడ్.