షమీ 'సూపర్‌' స్పెల్‌ | Bengal beat Uttarakhand in Ranji Trophy | Sakshi
Sakshi News home page

షమీ 'సూపర్‌' స్పెల్‌

Oct 19 2025 4:26 AM | Updated on Oct 19 2025 4:26 AM

Bengal beat Uttarakhand in Ranji Trophy

ఉత్తరాఖండ్‌పై బెంగాల్‌ ఘనవిజయం 

రంజీ ట్రోఫీలో శుభారంభం 

కోల్‌కతా: టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ షమీ సత్తా చాటడంతో... రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో బెంగాల్‌ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా శనివారం ఉత్తరాఖండ్‌తో ముగిసిన పోరులో బెంగాల్‌ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 165/2తో శనివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరాఖండ్‌... చివరకు 96.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ కునాల్‌ చండేలా (235 బంతుల్లో 72; 8 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ ప్రశాంత్‌ చోప్రా (163 బంతుల్లో 82; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీలు చేశారు. 

బెంగాల్‌ బౌలర్లలో షమీ 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఆకాశ్‌దీప్, ఇషాన్‌ పొరేల్‌ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.  తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన షమీ... రెండో ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ఫలితంగా బెంగాల్‌ ముందు 156 పరుగుల లక్ష్యం నిలవగా... ఆ జట్టు 29.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ చేజ్‌ చేసింది. 

కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (82 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో జట్టును గెలిపించాడు. ఫిట్‌నెస్‌ కారణాలతో ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపిక కాలేకపోయిన షమీ... రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. 

తమిళనాడు ఓటమి 
బ్యాటర్లు విఫలమవడంతో... రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు పరాజయం పాలైంది. కోయంబత్తూర్‌ వేదికగా జరిగిన పోరులో జార్ఖండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో తమిళనాడును మట్టికరిపించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 52/3తో శనివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన తమిళనాడు... 79 ఓవరల్లో 212 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రె సిద్ధార్థ్‌ (180 బంతుల్లో 80; 12 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. 

జార్ఖండ్‌ బౌలర్లలో రిశవ్‌ రాజ్‌ 4, అనుకూల్‌ రాయ్‌ 3 వికెట్లు పడగొట్టారు. అంతకముందు జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులు చేయగా... తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే పరిమితమై ఫాలోఆన్‌ ఆడింది. భారీ సెంచరీతో కదం తొక్కిన జార్ఖండ్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.  

ముంబై ఘనవిజయం 
ఆల్‌రౌండర్‌ షమ్స్‌ ములానీ అదరగొట్టడంతో ముంబై జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో బోణీ కొట్టింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ముంబై 35 పరుగుల తేడాతో జమ్మూ కశ్మీర్‌ను చిత్తుచేసింది. శ్రీనగర్‌ వేదికగా జరిగిన పోరులో 243 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 21/1తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జమ్మూ కశ్మీర్‌ చివరకు 64.4 ఓవర్లలో 207 పరుగులకే పరిమితమైంది. 

ఖమ్రాన్‌ ఇక్బాల్‌ (107 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ శతకం సాధించగా.. కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (29), అఖీబ్‌ నబీ (37), సాహిల్‌ లోత్రా (29) తలా కొన్ని పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షమ్స్‌ ములానీ 7 వికెట్లతో విజృంభించాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేయగా... జమ్మూకశ్మీర్‌ 325 పరుగులు చేసింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసిన ముంబై... ప్రత్యర్థి ముందు 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 132 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టిన ముంబై ఆల్‌రౌండర్‌ షమ్స్‌ ములానీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.  

» టీమిండియా ప్లేయర్లు హనుమ విహారి, విజయ్‌ శంకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిపుర జట్టు... ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో సర్వీసెస్‌ చేతిలో ఇన్నింగ్స్‌ 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సర్వీసెస్‌ బౌలర్‌ అర్జున్‌ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇదే గ్రూప్‌లో భాగంగా అస్సాం, గుజరాత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.  

» ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో బరోడా జట్టు 7 వికెట్ల తేడాతో ఒడిశాపై గెలుపొందింది. కటక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన బరోడా బ్యాటర్‌ శివాలిక్‌ శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.  

» తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని భయపెట్టిన గోవా జట్టు... ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో చండీగఢ్‌పై ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదే గ్రూప్‌లో భాగంగా మహారాష్ట్ర, కేరళ జట్ల మధ్య తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. మధ్యప్రదేశ్, పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ కూడా ‘డ్రా’ కాగా... మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

»   రంజీ ట్రోఫీలో ఎలైట్‌ గ్రూప్‌ల్లో మొత్తం 32 జట్లు... నాలుగు గ్రూప్‌లుగా పోటీపడుతున్నాయి. మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 6 పాయింట్లు, ఇన్నింగ్స్‌ తేడాతో నెగ్గిన జట్టుకు 7 పాయింట్లు కేటాయించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన జట్టుకు 3 పాయింట్లు దక్కాయి. ‘డ్రా’ చేసుకున్న జట్టుకు ఒక పాయింట్‌ దక్కింది.  

మానవ్‌ మాయాజాలం 
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (8/42) అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు అర్థంకాని బంతులతో విజృంభించి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 64/4తో శనివారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఛత్తీస్‌గఢ్‌ చివరకు 49.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది.

ఆయుశ్‌ పాండే (27), సంజీత్‌ దేశాయ్‌ (24) తలా కొన్ని పరుగులు చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మానవ్‌ సుతార్‌ 22.3 ఓవర్లలో 42 పరుగులిచ్చి 8 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన సుతార్‌... రెండో ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్‌ బ్యాటర్లను క్రీజులో నిలవనివ్వలేదు. 

అనంతరం 56 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్తాన్‌ 11.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 58 పరుగులు చేసింది. మహిపాల్‌ లోమ్రర్‌ (35 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ 332 పరుగులు చేయగా... రాజస్తాన్‌ 386 పరుగులు చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement