
నేడు ఇంగ్లండ్‌తో కీలక పోరు
ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం!
మ.గం.3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఇంగ్లండ్‌తో తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించి సానుకూలంగా టోర్నీని మొదలుపెట్టిన భారత్ ఆ తర్వాత తడబడింది. రెండు పటిష్ట జట్లు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా చేతిలో పరాజయంపాలైంది. ఇప్పుడు మరో కఠిన ప్రత్యర్థి ఇంగ్లండ్ రూపంలో ఎదురైంది.
ఇటీవలి కాలంలో ఈ జట్టుపై మన రికార్డు బాగున్నా... వరల్డ్ కప్ ఒత్తిడిని అధిగమించి పైచేయి సాధించడం ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ఓడితే తర్వాతి రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరో వైపు నాట్ సివర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి (ఒకటి రద్దు) జోరు మీదుంది.
అమన్‌జోత్ స్థానంలో రేణుక!
తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఆ్రస్టేలియాపై భారత్‌కు మెరుగైన ఆరంభం లభించింది. స్మతి మంధాన, మరో ఓపెనర్ ప్రతీక కూడా అర్ధసెంచరీలు సాధించారు. హర్లీన్, జెమీమా కూడా కీలక పరుగులు సాధించారు. అయితే హర్మన్ మరోసారి అంచనాలకు తగినట్లు ఆడటంలో విఫలమైంది. రిచా ఘోష్ దూకుడుగా ఆడటం పెద్ద సానుకూలాంశం. దీప్తి చాలా కాలంగా బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోతోంది.
మరో సారి ప్రధాన బ్యాటర్లంతా మెరుగ్గా ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఆసీస్‌పై 330 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఇలాంటి స్థితిలో బౌలింగ్ బలహీనత బయటపడింది. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు విఫలమైనా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అయినా సరే అదే వ్యూహాన్ని జట్టు కొనసాగించే అవకాశం ఉంది.
హర్మన్ ఎలాగూ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలదు. ఆల్‌రౌండర్ అమన్‌జోత్ స్థానంలో పేసర్ రేణుక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. యువ బౌలర్లు క్రాంతి, చరణి ఒత్తిడిని అధిగమించాల్సి ఉంది. చరణితో పాటు దీప్తి, స్నేహ్ స్పిన్‌తో ఇంగ్లండ్‌కు కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది.
ఫామ్‌లో కెప్టెన్...
పాకిస్తాన్‌తో గత మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, అంతకు ముందు బలహీన బంగ్లా, శ్రీలంకను ఇంగ్లండ్ ఓడించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాను 69కే కుప్పకూల్చినా... జట్టు బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. కెపె్టన్ సివర్ బ్రంట్, హీతర్ నైట్ మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. ఎమీ జోన్స్, బీమాంట్‌లలో ఇంకా తడబాటు కనిపిస్తోంది.
సోఫీయా డంక్లీ, ఎమా ల్యాంబ్‌లనుంచి జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్‌తో పోలిస్తే ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉండటం విశేషం. భారత్‌పై పలు మార్లు చక్కటి ప్రదర్శన కనబర్చిన సోఫీ ఎకెల్‌స్టోన్‌తో పాటు మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ లిన్సీ స్మిత్ కూడా వరల్డ్ కప్‌లో చక్కగా రాణిస్తున్నారు. ప్రధాన పేసర్ లారెన్ బెల్ ఆరంభంలో ప్రత్యర్థిని నిలువరించగలదు.