
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లేదా డ్రాగా ముగించైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే, టీమిండియా మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను పేస్ బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండగా.. ఆకాష్ దీప్ గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా చేతి వేలి గాయం కారణంగా లెఫ్ట్మ్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు.
అతడి స్ధానంలో జట్టులోకి వచ్చిన యువ పేసర్ అన్షుల్ కాంబోజ్.. తన తొలి మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. అంతకుతోడు ఆఖరి రెండు టెస్టులకు దూరంగా ఉన్న పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కూడా చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేడు. దీంతో కీలకమైన ఐదో టెస్టులో భారత ఫాస్ట్ బౌలింగ్ కాంబనేషన్ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బౌలర్ల ఫిట్‌నెస్‌పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
ఇంగ్లండ్‌తో చివరి టెస్టు కోసం జస్‌ప్రీత్ బుమ్రా సహా భారత బౌలింగ్ బృందమంతా సిద్ధంగా ఉందని, ఎలాంటి గాయాల సమస్య లేదని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే బుమ్రా విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, తుది జట్టుకు సంబంధించి ఇంకా చర్చ జరగలేదని అతడు పేర్కొన్నాడు. కాగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టును టీమిండియా పోరాడి డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్ ముందంజలో ఉంది.
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్