డిఫెండింగ్ చాంపియన్ హరియాణా అవుట్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఫైనల్ రేసులో పడేందుకు మాజీ చాంపియన్లు జైపూర్ పింక్‌పాంథర్స్, పట్నా పైరేట్స్ ఒక ముందడుగు వేశాయి. 5–8 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య శనివారం ప్లే ఇన్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జైపూర్ 30–27తో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు పింక్‌పాంథర్స్ కడదాకా చెమటోడ్చింది. రెయిడర్లలో నితిన్ కుమార్ (7) ఒక్కడే ఆకట్టుకున్నాడు.
23 సార్లు కూతకెళ్లిన అతను ఏడుసార్లు పాయింట్లు తెచ్చిపెట్టగా, మూడుసార్లు అవుటయ్యాడు. డిఫెండర్లు ఆర్యన్ కుమార్ (5), దీపాన్షు ఖత్రి (4), మోహిత్ (3) సమన్వయంతో రాణించారు. హరియాణా తరఫున రెయిడర్లు శివమ్ పతారే (6), వినయ్ (4) చెప్పుకోదగ్గ పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో నీరజ్ 5, కెప్టెన్ జైదీప్ 2 పాయింట్లు చేశారు.
అనంతరం జరిగిన మరో ప్లే ఇన్ మ్యాచ్‌లో ‘హ్యాట్రిక్’ పీకేఎల్ చాంప్ పట్నా పైరేట్స్ 40–31తో యూ ముంబాను ఓడించింది. పైరేట్స్ జట్టులో అయాన్ (14), నవ్‌దీప్ (7), మిలన్ దహియా (5) కీలకపాత్ర పోషించారు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ (12), సందీప్ (7), పర్వేశ్ భైన్‌స్వాల్ (3) రాణించారు.
బెంగళూరుతో టైటాన్స్ ఢీ నేడు
పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య నేడు మినీ క్వాలిఫయర్ సంగ్రామం జరుగుతుంది. అయితే ఈ మినీ పోరాటంలో ఓడిన జట్టు ఉన్నపళంగా లీగ్ నుంచి ఇంటికెళ్లదు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్ రూపంలో ఫైనల్ రేసులో సజీవంగా నిలిచే ఉంటుంది.
నేడు జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్‌ల మధ్య జరిగే తొలి ఎలిమినేటర్ విజేతతో సోమవారం జరిగే రెండో ఎలిమినేటర్‌లో తలపడుతుంది. ఇక మినీ క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టేమో మంగళవారం జరిగే మూడో ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది.


