
దులీప్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ ఓపెనర్, తమిళనాడు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నారయణ్ జగదీశన్‌ను దురదృష్టం వెంటాడింది. డబుల్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో జగదీశన్ ఔటయ్యాడు.
అది కూడా రనౌట్ రూపంలో తన వికెట్‌ను జగదీశన్ కోల్పోయాడు. 148 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌ను మొదలు పెట్టిన జగదీశన్.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ తమిళనాడు ఆటగాడు సునాయసంగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించాడు.
కానీ 197 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జగదీశన్.. నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు అద్భుత త్రోకు బలయ్యాడు. జగదీశన్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.
128 ఓవర్లు ముగిసే సరికి సౌత్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 432 పరుగులు చేసింది. క్రీజులో తనయ్ త్యాగరాజన్(5), సల్మాన్ నిజార్(23) ఉన్నారు. సౌత్ జోన్ బ్యాటర్లలో జగదీశన్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 3, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు.
ఇక ఈ మ్యాచ్‌లో తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న జగదీశన్ త్వరలో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా జగదీశన్ ఎంపికయ్యాడు.
లండన్ టెస్టు ముందు భారత జట్టులో చేరిన జగదీశన్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు నారయణ్‌ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. ఎందుకంటే రిషబ్ పంత్‌తో పాటు వికెట్ కీపర్లు ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ గాయాలతో సతమతమవుతున్నారు.
అయితే గత కొంత కాలంగా పంత్‌కు బ్యాకప్‌గా జురెల్ కొనసాగుతున్నాడు. ఇప్పుడు జురెల్ కూడా గాయం బారిన పడడంతో జగదేశన్‌కు టీమిండియా తరపున డెబ్యూ చేసే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: సారా టెండుల్కర్ నిశ్చితార్థం కూడా అయిపోయిందా?.. ఎవరీ అబ్బాయి?