
PC: X
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) తనపై చేసిన ఆరోపణలపై టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) స్పందించాడు. తాను ఉద్దేశపూర్వకంగా పిచ్ మధ్యలోకి వెళ్లలేదని.. ఇంగ్లండ్ బౌలింగ్ విధానమే తనను అందుకు పురిగొల్పిందని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఇంగ్లండ్ ఆటగాళ్లు పదే పదే అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారని.. కానీ తాము మాత్రం ఇలాంటి తప్పులు చేయమని తెలిపాడు.
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారీ డబుల్ సెంచరీ (269)తో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87 అద్భుతంగా రాణించగా.. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది.
అంపైర్‌కు ఫిర్యాదు
ఇక గురువారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా జడ్డూపై ఇంగ్లండ్ పేసర్ క్రిస్‌వోక్స్, కెప్టెన్ స్టోక్స్ పిచ్‌ను పాడుచేస్తున్నాడంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. కావాలనే పదే పదే పిచ్ మధ్యలోకి పరిగెత్తుకు వచ్చి డ్యామేజ్ చేస్తున్నాడంటూ ఆరోపించారు.
స్టోక్స్‌కు ఇచ్చిపడేసిన జడ్డూ
ఇదే విషయంపై స్టోక్స్ జడ్డూతో.. ‘‘చూడు మేట్.. నువ్వేం చేస్తున్నావో కనబడుతోందా?’’ అంటూ మైదానంలోనే వాగ్వాదానికి దిగాడు కూడా!.. ఇందుకు జడ్డూ గట్టిగానే బదులిచ్చాడు. ‘‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో చూస్తూనే ఉన్నావు కదా!..
నేనైతే ఇలాంటి ఏరియాల్లో బౌలింగ్ చేయను. అయినా నా దృష్టి మొత్తం ఇప్పుడు బ్యాటింగ్ మీదే ఉంది’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం జడేజా స్పందించాడు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేనేదో కావాలనే పిచ్‌ను తొక్కుతున్నట్లు వారు భావించారు. నిజానికి ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో నేను అదే పని చేశాను. కానీ వాళ్లు ప్రతిసారి అంపైర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
నాకైతే పిచ్ మధ్యలోకి వెళ్లాలన్న ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. పరుగులు తీసే క్రమంలో నేను ముందుకు సాగిపోతూ ఉన్నానంతే!.. ఏదేమైనా నాకు అవకాశం వస్తే గనుక... నేను వాళ్లలా బౌల్ చేయను. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో.. సరైన చోటే బంతిని వేస్తాను’’ అని జడ్డూ చెప్పుకొచ్చాడు. కాగా గురువారం నాటి ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
చదవండి: IND vs ENG 2nd Test: వైభవ్ సూర్యవంశీని పిలిపించిన బీసీసీఐ!
Sir Jadeja classic on the Stumps Mic. 😂 pic.twitter.com/SqhuVJqq4f
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025