ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోరీ్నకి అర్హత సాధించలేక చతికిలబడింది. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన ఇటలీ... తాజా క్వాలిఫయర్స్ చివరి రౌండ్‌లో బోస్నియా అండ్ హెర్గెగోవినా జట్టు చేతిలో ఓడిపోయింది. మరో మూడు నెలల్లో జరిగే 2026 వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయింది. 2006లో చివరిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న ఇటలీ... ఆ తర్వాత నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతూ వస్తోంది. ‘కర్ణుడి చావుకు లక్ష కారణాలు’ అన్న చందంగా... ఇటలీ జట్టు పేలవ ఆటతీరుకు కారణాలెన్నో. క్రికెట్‌లో వెస్టిండీస్ మాదిరిగా ఒకప్పుడు అరవీర భయంకర ప్లేయర్లతో ప్రత్యర్థులను గడగడలాడించి నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ... ఇప్పుడు అస్థిత్వం కోసం పోరాడుతోంది. క్లబ్ గేమ్స్, మ్యాచ్ రెవెన్యూ, టికెట్ ఆదాయం, ప్రకటనల రాబడి, మౌలిక వసతులను పట్టించుకోకోకపోవడం, యువతకు ప్రోత్సాహం కరువవడం ఇలా ప్రతి అంశంలో నానాటికి తీసికట్టులా మారుతున్న ఇటలీ ఫుట్‌బాల్ తీరును ఓసారి పరిశీలిస్తే...
సాక్షి క్రీడావిభాగం : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఇప్పటి వరకు 22 సార్లు వరల్డ్ కప్ జరగ్గా... అందులో ఆరుసార్లు ఇటలీ ఫైనల్ చేరింది. నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006లో) ట్రోఫీ చేజిక్కించుకున్న ఇటలీ... 1970, 1994లో రన్నరప్‌గా నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) ప్రపంచ విజేతగా నిలవగా... ఆ తర్వాత జర్మనీ (1954, 1974, 1990, 2014)తో కలిసి ఇటలీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది జూన్–జూలైలో కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా ఇటలీ లేకుండానే ప్రపంచకప్ జరగనుంది.
గత రెండు (2018, 2022లో) పర్యాయాలు కూడా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన ఇటలీ జట్టు... అంతకుముందు 2010, 2014లో గ్రూప్ దశను దాటలేకపోయింది. 2006లో చివరిసారిగా చాంపియన్‌గా నిలిచిన ఇటలీ... ఆ తర్వాత ప్రధాన ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలకడం... యువతరం ఆ స్థాయిలో రాణించలేకపోవడంతో గత రెండు దశాబ్దాల్లో ప్రభావం కోల్పోతూ వచి్చంది. క్రికెట్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’గా టీమిండియాకు ఎంత ఆదరణ ఉందో... ఫుట్‌బాల్‌లో ‘ద బ్లూస్’ (అజూరి)గా ఇటలీకి అంతకంటే ఎక్కువ స్టార్‌డమ్ ఉంది. అలాంటి ఇటలీ ఇప్పుడు వరుసగా మూడోసారి (2018, 2022, 2026), ఓవరాల్‌గా నాలుగోసారి (1958లో తొలిసారి) వరల్డ్‌కప్‌నకు దూరమైంది.
జట్ల సంఖ్య పెరిగినా...
2022లో ఖతర్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 32 జట్లు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్యను 48కి పెంచారు. ఇలాంటి సమయంలోనూ ఇటలీ క్వాలిఫై కాకపోవడం ఆ జట్టు పడిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం జరిగిన పోరులో ఇటలీ పెనాల్టీ షూటౌట్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా చేతిలో ఓడింది. తొలుత నిరీ్ణత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్ సాధించడంతో మ్యాచ్ ‘డ్రా’కాగా... విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో బోస్నియా 4–1 గోల్స్ తేడాతో ఇటలీని బోల్తా కొట్టించింది. దీంతో ఇటలీ ఆటగాళ్లకు వరుసగా మూడోసారి నిరాశ తప్పలేదు.
మరో వెస్టిండీస్ మాదిరిగా...
2006లో వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం ఇటలీ జట్టు 2020లో యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఏ టోర్నమెంట్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. 2006లో ఇటలీ జట్టు వరల్డ్ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన మిడ్‌ఫీల్డర్ గటుసో... ప్రస్తుతం జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ అతడు ఇటలీ రాత మార్చలేకపోయాడు. ప్రస్తుతానికైతే ఎలాంటి చర్యలు ఉండవని ఇటలీ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు గాబ్రియల్ గ్రావినా ప్రకటించినా... ఇలాగే కొనసాగితే క్రికెట్‌లో వెస్టిండీస్ మాదిరిగా ఫుట్‌బాల్‌లో ఇటలీ ప్రభ కూడా మసకబారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్టార్‌లు లేకపోయినా...
గొప్ప క్రమశిక్షణ, అంతకుమించిన అంకితభావంతో ఒకప్పుడు ఇటలీ జట్టు మైదానంలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేది. అర్జెంటీనాకు లియోనల్ మెస్సీ, పోర్చుగల్‌కు క్రిస్టియానో రొనాల్డో లాగా... ఇటలీ జట్టుకు స్టార్ ప్లేయర్ల అండ లేకపోయినా... ఆ జట్టు సమష్టితత్వానికి పెట్టింది పేరు. చక్కటి సమన్వయం అంతకుమించిన నైపుణ్యంతో గ్రౌండ్‌లో మ్యాజిక్ చేసే ఇటలీ జట్టులో ప్రస్తుతం బృంద స్ఫూర్తి లోపించిందనేది సుస్పష్టం. 1992 నుంచి 1996 వరకు వరుసగా మూడుసార్లు యూరోపియన్ చాంపియన్‌గా నిలిచిన ఇటలీ... 2006లో తమ దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత పటిష్ట జట్టుతో బరిలోకి దిగి వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాతి నుంచి దేశంలో ఆటకు ఆదరణ తగ్గుతూ వస్తోంది.
ఒకప్పుడు క్లబ్ ఫుట్‌బాల్‌లో సైతం ఇటలీ జట్ల హవా సాగేది. కానీ గత దశాబ్దకాలాన్ని పరిశీలిస్తే ఆ వైభవం మచ్చుకైనా కనిపించడం లేదు. నానాటికి ఇటలీ ఆట తీసికట్టుగా మారుతుండటంతో... ప్రేక్షకుల్లో ఆటపై ఆదరణ సైతం తగ్గుతోందని ఇటీవలి ఆదాయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ జట్టు మైదానంలో అడుగు పెడుతోందంటే... స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయేది. టికెట్ ఆదాయం, మైదానంలో ప్రకటనల రాబడితో పాటు... టీవీ రైట్స్ రూపంలో పెద్ద ఎత్తున డబ్బు వచ్చేది. కానీ గత రెండు దశాబ్దాల్లో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. టీవీ రైట్స్ విషయంలోనూ ఇటలీ చాలా వెనుకబడిపోయింది. ఇది పరోక్షంగా ఆటపై పెట్టుబడి పెట్టడంలో వెనకడుగు వేసేలా చేసింది. మరి వీటన్నింటినీ అధిగమించి 2030లో మొరాకో, పోర్చుగల్, స్పెయిన్‌లో జరిగే ప్రపంచకప్ వరకైనా ఇటలీ జట్టు గాడిన పడుతుందా చూడాలి!
కింకర్తవ్యం
గతంలో అర్జెంటీనా (1970), ఇంగ్లండ్ (1974) వంటి జట్లు సైతం ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయిన సందర్భాలున్నాయి. అయితే అవి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి లోపాలను సరిచేసుకొని సత్తా చాటాయి. ఇటలీ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు సాకర్ ప్రపంచాన్ని ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రపంచకప్‌నకు క్వాలిఫై కాలేదంటే... వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. గత దశాబ్ద కాలంగా పేలవ ఆటతీరు రోజు రోజుకు ప్రమాణాలు దిగజార్చుకున్న ఇటలీ... ఈ పరాజయంతోనైనా కళ్లు తెరుస్తుందా చూడాలి. ఇటలీ ఫుట్‌బాల్ తిరిగి గాడిన పడాలంటే... సమస్య మూలాలను గుర్తించాల్సిన అవసరముంది. సమాఖ్యను ప్రక్షాళన చేయడం... మౌలిక వసతులు పెంపొందించడం... యువతకు సరైన మార్గనిర్దేశం చేయడం... ఆటగాళ్లకు అండగా నిలవడం వీటన్నింటీపై దృష్టి సారించడం ముఖ్యం.
గ్రూప్ దశలో తడబడి...
యూరోపియన్ జోన్‌లో భాగంగా అన్ని జట్లను 12 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌లో ‘టాపర్’గా నిలిచిన 12 జట్లు ముందుగా ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఇటలీ ఉన్న గ్రూప్ ‘ఐ’ నుంచి నార్వే 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ముందంజ వేసింది. ఇటలీ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరింట విజయం సాధించి 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఇటలీ గ్రూప్ దశలోనే మొదటి స్థానంలో నిలిస్తే ప్రపంచకప్‌కు అర్హత పొందేది. కానీ రెండో స్థానంలో నిలవడంతో ప్రపంచకప్ బెర్త్ కోసం తదుపరి దశ ఆడాల్సి వచ్చింది.
12 గ్రూపుల్లో రెండో స్థానంలో నిలిచిన 12 జట్లు... నేషన్స్ లీగ్‌లో నాలుగు గ్రూప్‌ల విజేతలతో కలిపి 16 జట్లు తదుపరి దశలో పోటీపడ్డాయి. 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో ఇటలీ తొలి మ్యాచ్‌లో 2–0తో నార్తర్న్ ఐర్లాండ్‌ను... బోస్నియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో వేల్స్‌పై గెలిచి ప్రపంచకప్ బెర్త్ కోసం పోటీపడ్డాయి. బెర్త్‌ను ఖరారు చేసే మ్యాచ్‌లో 15వ నిమిషంలో కీన్ చేసిన గోల్‌తో ఇటలీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో తబాకోవిచ్ గోల్‌తో బోస్నియా 1–1తో స్కోరును సమం చేసింది.
ఆ తర్వాత ఇరు జట్లు మరో గోల్ చేయలేకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో బోస్నియా ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్‌లను గోల్స్‌గా మలిచారు. ఇటలీ తరఫున తొలి షాట్‌లో ఎస్పెసిటో, మూడో షాట్‌లో క్రిస్టాంటీ గురి తప్పగా... రెండో షాట్‌ను టొనాలి సఫలమయ్యాడు. నాలుగో షాట్‌ను బోస్నియా ప్లేయర్ బజ్రాక్‌తారెవిచ్ లక్ష్యానికి చేర్చడంతో ఇటలీ ఓటమి ఖరారుకాగా... బోస్నియా రెండోసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
40 ఏళ్ల తర్వాత... ప్రపంచకప్ టోర్నీకి ఇరాక్ అర్హత
మోంటెరే (మెక్సికో): నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఇరాక్ జట్టు పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇరాక్ 2–1 గోల్స్ తేడాతో బొలీవియా జట్టును ఓడించింది. తద్వారా 1986 తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోరీ్నలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఇరాక్ తరఫున అలీ అల్‌మహది (18వ నిమిషంలో), ఐమెన్ హుస్సేన్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. బొలీవియా జట్టుకు మోజెస్ పనియగువా (38వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. నెల రోజుల క్రితం వరకు ఇరాక్ జట్టు ఈ ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుందా లేదా అనే అనుమానం ఉంది. పశి్చమాసియాలో యుద్ధం కారణంగా ఇరాక్ గగనతలం మూసేశారు. మెక్సికోలో ఇరాక్ రాయబార కార్యాలయం లేకపోవడంతో ఇరాక్ ఆటగాళ్లకు వీసా ఇబ్బందులు తలెత్తాయి. మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి చొరవతో ఇరాక్ ఆటగాళ్లకు వీసాలు లభించాయి. వివిధ మార్గాల్లో 25 గంటలపాటు ప్రయాణించి మార్చి 21వ తేదీన మెక్సికోకు ఇరాక్ జట్టు చేరుకోగలిగింది.
డీఆర్ కాంగో పేరుతో తొలిసారి...
బుధవారంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిశాయి. మెక్సికోలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆఫ్రికా ఖండానికి చెందిన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1–0తో జమైకాను ఓడించింది. ప్రపంచకప్ బెర్త్ దక్కించుకుంది. డీఆర్ కాంగో ఇంతకుముందు జైర్ పేరుతో 1974 ప్రపంచకప్‌లో ఆడింది. 1998 నుంచి డీఆర్ కాంగో పేరుతో బరిలోకి దిగి 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో అడుగు పెట్టనుంది. ఇతర క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో స్వీడన్ 3–2తో పోలాండ్‌పై, చెక్ రిపబ్లిక్ ‘షూటౌట్’లో 3–1తో డెన్మార్క్‌పై, టర్కీ 1–0తో కొసోవోపై గెలిచి ప్రపంచకప్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.


