IPL 2026: శ్రేయస్‌ అయ్యర్‌ పోస్ట్‌ వైరల్‌! | IPL 2026: Shreyas Iyer 1st Reaction After PBKS Elimination Goes Viral | Sakshi
Sakshi News home page

ఆకలి, కసి: శ్రేయస్‌ అయ్యర్‌ పోస్ట్‌ వైరల్‌!

May 26 2026 2:18 PM | Updated on May 26 2026 2:47 PM

IPL 2026: Shreyas Iyer 1st Reaction After PBKS Elimination Goes Viral

ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ ప్రయాణం విచిత్రంగా సాగింది. ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓటమన్నదే ఎరుగని శ్రేయస్‌ అయ్యర్‌ సేన.. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

పంజాబ్‌కు తప్పని పరాభవం
ఫలితంగా ప్లే ఆఫ్స్‌ చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచి.. ముంబై ఇండియన్స్‌పై ఆశలు పెట్టుకుంది. అయితే, రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ముంబై ఓడిపోవడంతో పంజాబ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పైసా వసూల్‌ ప్రదర్శన
ఈ నేపథ్యంలో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలు వచ్చాయి. కాగా గతేడాది వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్‌ శ్రేయస్‌ను కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. అందుకు తగ్గట్లుగానే ఈ ముంబైకర్‌ పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడు.

బ్యాటర్‌గా 604 పరుగులు సాధించిన అయ్యర్‌.. కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే, టైటిల్‌ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పంజాబ్‌.. తొలిసారి ట్రోఫీని గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.

ఆరంభంలోనూ అదుర్స్‌
ఇక గతేడాది మాదిరే ఐపీఎల్‌-2026లోనూ జోరు కొనసాగించిన పంజాబ్‌ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ ఫేవరెట్‌గా ముందుకు సాగింది. కానీ అనూహ్య రీతిలో డబుల్‌ హ్యాట్రిక్‌ ఓటములతో డీలా పడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

స్పందించిన శ్రేయస్‌
ఈ నేపథ్యంలో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తొలిసారి స్పందించాడు. ఇన్‌స్టా వేదికగా జట్టుతో ఉన్న దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు.. ప్రతీ క్షణం.. ప్రతీ పోరాటం. ఈ అధ్యాయం కృతజ్ఞతతో ముగిసింది. ఆకలి, కసితో తదుపరి అధ్యాయం మొదలవుతుంది’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ క్యాప్షన్‌ జతచేశాడు.

తద్వారా 2027లో తాము రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తామని అయ్యర్‌ చెప్పకనే చెప్పాడు. కాగా ఈ సీజన్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 14 మ్యాచ్‌లలో కలిపి 498 పరుగులు సాధించాడు. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో లక్నోపై శ్రేయస్‌ (101 నాటౌట్‌) శతక్కొట్టడం విశేషం.

చదవండి: వాళ్లిద్దరు తేలిపోతే ఆర్సీబీకి కష్టమే: సెహ్వాగ్‌

Advertisement
 
Advertisement
Advertisement