ఎస్‌ఆర్‌హెచ్‌కు హార్ట్‌ బ్రేక్‌.. ఐపీఎల్‌ నుంచి నిష్క్రమణ | IPL 2026: Rajasthan Royals beat SRH in Eliminator | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌కు హార్ట్‌ బ్రేక్‌.. ఐపీఎల్‌ నుంచి నిష్క్రమణ

May 27 2026 11:27 PM | Updated on May 27 2026 11:27 PM

IPL 2026: Rajasthan Royals beat SRH in Eliminator

ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ (మే 27) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చిత్తుగా ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.  

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆరెంజ్‌ ఆర్మీ ప్రత్యర్దికి భారీ స్కోర్‌ సమర్పించుకుంది. వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు) ఊచకోత కోయడంతో రాజస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

వైభవ్‌తో పాటు ధృవ్‌ జురెల్‌ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. ఓ దశలో 260-270 వచ్చేలా కనిపించిన రాజస్థాన్‌ స్కోర్‌.. చివరి 5 ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. చివరి రెండు ఓవర్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉండింది.

12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. చివర్లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్లు సాకిబ్‌ హుసేన్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, ఎషాన్‌ మలింగ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రఫుల్‌ హింగే (4-0-54-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. 

ఓ పక్క సహచరులంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా శివాంగ్‌ కుమార్‌ (2-0-19-1), నితీశ్‌ కుమార్‌ (2-0-12-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కమిన్స్‌ 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఎషాన్‌ మలింగ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి వికెట్‌ తీయగా.. సాకిబ్‌ హుసేన్‌ 4 ఓవర్లలో వికెట్‌ లేకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో వైభవ్‌, జురెల్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జైస్వాల్‌ 29, కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ 26, ఫెరియెరా 12, షనక 5, రవీంద్ర జడేజా 12 (నాటౌట్‌), ఆర్చర్‌ 4, బర్గర్‌ 1, సుషాంత్‌ మిశ్రా 1 (నాటౌట్‌) పరుగు చేశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఒత్తిడికి లోనైన ఆ జట్టు వేగంగా పరుగులు సాధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆర్చర్‌ (4-0-58-3), బర్గర్‌ (3-0-26-2), జడేజా (3-0-21-2), యశ్‌ రాజ్‌ పూనియా (4-0-39-1), సుషాంత్‌ మిశ్రా (2.2-0-21-2) ధాటికి 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటై, 47 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

ఈ గెలుపుతో రాజస్థాన్‌ క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. నిన్న జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌పై గెలిచిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరింది. 

Advertisement
 
Advertisement
Advertisement