డికాక్‌ కొత్త చరిత్ర.. ఒక్క సెంచ‌రీతో ఇన్ని రికార్డులా? | IPL 2026: Quinton de Kock 3rd Player With 100s for Three IPL Franchises | Sakshi
Sakshi News home page

డికాక్‌ కొత్త చరిత్ర.. ఒక్క సెంచ‌రీతో ఇన్ని రికార్డులా?

Apr 16 2026 9:58 PM | Updated on Apr 16 2026 11:26 PM

IPL 2026: Quinton de Kock 3rd Player With 100s for Three IPL Franchises

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ సీజ‌న్‌లో డికాక్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్‌లోనే శ‌త‌క్కొట్టడం విశేషం. ఈ నేప‌థ్యంలో డికాక్ ఒక్క సెంచ‌రీతో ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

  • టీ20 క్రికెట్‌లో డికాక్‌కు ఇది 9వ సెంచ‌రీ. టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జ‌దా ఫ‌ర్హాన్‌లు కూడా 9 శ‌త‌కాల‌తో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా, బాబ‌ర్ ఆజ‌మ్ (11), డేవిడ్ వార్న‌ర్ (10) శ‌త‌కాల‌తో రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

  • ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జ‌ట్లు త‌ర‌ఫున సెంచ‌రీలు బాదిన మూడో బ్యాట‌ర్‌గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ త‌ర‌ఫున ఆర్సీబీతో మ్యాచ్‌లో 108 ప‌రుగులు, 2022లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ర‌ఫున కేకేఆర్‌తో మ్యాచ్‌లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అజేయ శ‌త‌కంతో మెరిశాడు. గ‌తంలో సంజూ శాంస‌న్ (ఢిల్లీ, రాజ‌స్తాన్‌, సీఎస్‌కే), కేఎల్ రాహుల్ (పంజాబ్‌, ఢిల్లీ, ల‌క్నో) ఈ ఫీట్ సాధించారు. మ‌రో విశేష‌మేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీప‌ర్లే కావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

  • ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున పంజాబ్‌పై సెంచ‌రీ సాధించిన రెండో బ్యాట‌ర్‌గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ‌ న్స్ (100 నాటౌట్‌) పంజాబ్‌పై తొలి సెంచ‌రీ సాధించాడు.

  • ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు న‌మోదు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. స‌న‌త్ జ‌య‌సూర్య (114 నాటౌట్‌) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శ‌ర్మ (109 నాటౌట్‌, 105 నాటౌట్‌) ముంబై త‌ర‌పున‌ రెండుసార్లు త‌న బెస్ట్ స్కోర్లు న‌మోదు చేశాడు.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో డికాక్‌ది రెండో సెంచ‌రీ. సీఎస్‌కే ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ ఈ సీజ‌న్‌లో తొలి సెంచ‌రీ సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముం​బై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు.పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయ‌గా, యాన్సెన్‌, శ‌శాంక్ సింగ్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.

చదవండి: ఐపీఎల్‌లో సెంచ‌రీ కొట్టిన అర్ష్‌దీప్‌

Advertisement
 
Advertisement
Advertisement