మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, గతేడాది రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో శుభారంభంపై దృష్టి పెట్టాయి. నేడు జరిగే పోరులో శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని టైటాన్స్‌తో శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతుంది.
భారత టి20 జట్టులో స్థానంలేని ఇరు జట్ల కెప్టెన్లు అటు తమ బ్యాటింగ్‌తో, ఇటు నాయకత్వంతో తమను తాము నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ప్రతీ సీజన్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నా... గిల్ స్ట్రయిక్‌రేట్‌పై ఇటీవల చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో తనలో దూకుడు పెంచాలని అతను భావిస్తున్నాడు.
మరోవైపు శ్రేయస్ గత ఏడాది అద్భుత బ్యాటింగ్‌తో 604 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తే జట్టు ముందంజ వేయవచ్చు. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. మూడుసార్లు గుజరాత్, మూడుసార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.
చదవండి: సినెర్‌దే మయామి మాస్టర్స్


