ట్రవిస్‌ హెడ్‌పై విమర్శలు.. ఎందుకిలా చేశావు? | IPL 2026 MI vs SRH: Travis Head Angrily Kicks IPL Property Video Viral | Sakshi
Sakshi News home page

ట్రవిస్‌ హెడ్‌పై విమర్శలు.. ఎందుకిలా చేశావు?

Apr 30 2026 3:29 PM | Updated on Apr 30 2026 3:59 PM

IPL 2026 MI vs SRH: Travis Head Angrily Kicks IPL Property Video Viral

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రవిస్‌ హెడ్‌ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో హెడ్‌ ప్రవర్తించిన తీరు ఇందుకు కారణం.

తొలి హాఫ్‌ సెంచరీ
తాజా ఎడిషన్‌లో ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) ఎట్టకేలకు తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సహచర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 45)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగులు జోడించాడు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. మరోవైపు.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (30 బంతుల్లో 65 నాటౌట్‌) రాణించగా.. ఆఖర్లో సలీల్‌ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్‌) వేగంగా ఆడాడు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని ఛేదించి.. వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిదింట ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది.

రొబోటిక్‌ డాగ్‌ను కాలితో తన్నిన హెడ్‌
ఇదిలా ఉంటే.. అభిషేక్‌ శర్మతో కలిసి హెడ్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో.. ఐపీఎల్‌ రొబోటిక్‌ మస్కట్‌ ‘చంపక్‌’ అతడికి అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి లోనైన హెడ్‌.. ఆ రొబోటిక్‌ డాగ్‌ను కాలితో తన్నాడు. అంతేకాదు బ్యాట్‌తో కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ప్రాపర్టీని తన్నిన కారణంగా హెడ్‌పై చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇటు ఐపీఎల్‌ పాలక మండలి గానీ.. అటు సన్‌రైజర్స్‌ కానీ స్పందించలేదు. కాగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియావళి ప్రకారం.. క్రికెట్‌కు సంబంధించిన పరికరాలు, క్లాతింగ్‌, ఇతర వస్తువులకు మ్యాచ్‌ సమయంలో హాని చేస్తే జరిమానా విధిస్తారు.

చంపక్‌ ఏం చేస్తుందంటే?
ఇదిలా ఉంటే.. రోబో కుక్క ‘చంపక్‌’ను ఐపీఎల్‌లో గతేడాది ప్రవేశపెట్టారు. ఇదొక కదిలే బ్రాడ్‌కాస్ట్‌ కెమెరా. మైదానంలో లో-యాంగిల్‌లో క్రికెట్‌ షాట్లు, ఆటగాళ్ల కదలికలను రికార్డు చేస్తుంది. అంతేకాదు అంపైర్లు, ప్లేయర్లకు సరదాగా షేక్‌హ్యాండ్లు ఇస్తూ సందడి చేస్తుంది. హెడ్‌ సైతం సరదాగానే చంపక్‌ను తన్ని ఉంటాడని అతడి అభిమానులు అంటున్నారు.

చదవండి: IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

Advertisement
 
Advertisement
Advertisement