లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ కుమార్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ ముకుల్ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్ హెల్మెట్‌ను తగిలి థర్డ్ మన్ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు.
— crictalk (@crictalk7) April 12, 2026
ఈ దెబ్బకు హెల్మెట్ ఉన్నా, ముకుల్ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్‌కు కంకషన్ టెస్ట్ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్‌కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్ కవర్ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్ పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టంగా ఉండేది.
ఒకవేళ ముకుల్ హెల్మెట్ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బంతి (154.2) కూడా అశోక్ ఖాతాలోనే ఉంది.
ముకుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్‌లో (కేకేఆర్‌పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముకుల్ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ముకుల్ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్ కూడా ధోని తరహాలోనే వికెట్‌కీపింగ్ బ్యాటర్‌గా ఉన్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది.


