
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. తొలుత నితీశ్ రాణాకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్‌ను జట్టులోకి తీసుకున్న రాయల్స్.. తాజాగా మరో గాయపడిన ఆటగాడు సందీప్ శర్మకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికాకే చెందిన నండ్రే బర్గర్‌ను ఎంపిక చేసుకుంది.
బర్గర్‌ను రాయల్స్ రూ. 3.5 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్నా బర్గర్‌పై రాయల్స్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన బర్గర్ గత ఐపీఎల్ సీజన్‌లో కూడా రాయల్స్‌కే ఆడాడు. ఆ సీజన్‌లో అతను 6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు.
సందీప్ శర్మ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉండిన సందీప్ చేతి వేలి గాయం కారణంగా రెండు మ్యాచ్‌ల ముందే వైదొలిగాడు. సందీప్ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. రాజస్తాన్ రాయల్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ అనే సిస్టర్ ఫ్రాంచైజీ ఉండటంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఆ దేశ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా రాయల్స్ జట్టులోకి వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ సీజన్‌లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల కోసం రూ. 30 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్‌కు విధ్వంసకర వీరుడిగా పేరుంది. అతను వికెట్‌కీపింగ్ కూడా చేయగలడు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తుండగా.. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ సీఎస్‌కే (మే 12), పంజాబ్ కింగ్స్‌తో (మే 16) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ 3 విజయాలు, 9 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.