SRH Vs GT: సన్‌రైజర్స్‌కు షాకిచ్చిన రషీద్‌ ఖాన్‌, తెవాటియా

IPL 2022: Gujarat Titans beat Sunrisers Hyderabad by 5 wickets - Sakshi

గుజరాత్‌ను గెలిపించిన రషీద్‌ ఖాన్‌

చివరి ఓవర్లో 25 పరుగులు రాబట్టిన టైటాన్స్‌

ఉమ్రాన్‌ 5 వికెట్ల ప్రదర్శన వృథా  

ముంబై: రషీద్‌ ఖాన్‌ గత సీజన్‌ దాకా సన్‌రైజన్స్‌ తురుపుముక్క. ఎన్నో మ్యాచ్‌లను తన స్పిన్‌తో గెలిపించాడు. ఈసారి గుజరాత్‌ స్పిన్నరైన రషీద్‌  మాజీ జట్టుపై తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే చెత్త బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. గతంలో వికెట్‌ తీయని సందర్భంలో 35 పరుగు లకుమించి ఇవ్వని రషీద్‌ ఈ సారి 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు! అయితే బంతితో చేయలేని మాయను రషీద్‌ (11 బంతుల్లో 31 నాటౌట్‌; 4 సిక్సర్లు) బ్యాట్‌తో చూపించి లెక్క సరిచేశాడు. ఓటమికి దగ్గరైన టైటాన్స్‌ను ఒక్క ఓవర్‌తో గెలిపించాడు.

6 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన ఉండగా క్రీజులో తెవాటియా, రషీద్‌ నిలిచారు. గుజరాత్‌ గెలుపు ఆశలు అడుగంటిన దశలో జాన్సెన్‌ ఆఖరి ఓవర్‌ వేయగా... తెవాటియా మొదటి బంతిని 6 కొట్టాడు. రెండో బంతికి సింగిల్‌ వచ్చింది. ఇక రషీద్‌ వరుసగా 6, 0, 6, 6తో మ్యాచ్‌ను  గెలిపించాడు. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సి వుండగా సిక్సర్‌ కొట్టడంతో గుజరాత్‌ శిబిరంలో ఆనందానికి అవధుల్లేవు.  

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ 5 వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాకిచ్చింది. హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. వృద్ధిమాన్‌ సాహా (38 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్స్‌), తెవాటియా (21 బంతుల్లో 40 నాటౌట్‌ 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమ్రాన్‌ మలిక్‌ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా జట్టుకు ఓటమి తప్పలేదు.  

రాణించిన అభిషేక్, మార్క్‌రమ్‌
విలియమ్సన్‌ (5)ను క్లీన్‌బౌల్ట్‌ చేసిన షమీ, ఆ తర్వాత రాహుల్‌ త్రిపాఠి (16) పని పట్టాడు. వరుసగా 6, 4, 4 కొట్టి ఊపుమీదున్న త్రిపాఠి ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. పవర్‌ప్లేలో స్కో రు 53 పరుగులకు చేరింది.  జోసెఫ్, ఫెర్గూసన్, రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇద్దరు యథేచ్ఛగా షాట్లు బాదారు. అభిషేక్‌ సిక్సర్‌ తో సన్‌రైజర్స్‌ 11.1 ఓవర్లో 100 పరుగుల్ని అధిగమించింది. అతని అర్ధ సెంచరీ (33 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పూర్తయ్యింది. 96 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి అల్జారీ జోసెఫ్‌  ముగింపు పలికాడు. 35 బంతుల్లో మార్క్‌రమ్‌ (2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ కూడా పూర్తయినప్పటికీ హైదరాబాద్‌ స్వల్ప వ్యవధిలో పూరన్‌ (3), మార్క్‌రమ్, వాషింగ్టన్‌ సుందర్‌ (3) వికెట్లను కోల్పోయింది.

సిక్సర్లతో విరుచుకుపడ్డ శశాంక్‌
సీజన్‌లో 5 మ్యాచ్‌లాడినా ఒక్కసారి కూడా బ్యాటింగ్‌ అవకాశం రాని శశాంక్‌ సింగ్‌ (6 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఈ ఆరో మ్యాచ్‌లో ఫెర్గూసన్‌ ఓవర్‌ను చితకబాదాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ తొలి బంతిని జాన్సెన్‌ 6 కొట్టి మూడో బంతికి పరుగు తీసి శశాంక్‌కు స్ట్రయిక్‌ ఇచ్చాడు. మిగిలిన మూడు బంతుల్ని 6, 6, 6 సిక్సర్లుగా దంచేశాడు.
                           
సాహా ధనాధన్‌
గుజరాత్‌ టైటాన్స్‌ పరుగుల వేట రెండో ఓవర్‌ నుంచి ఊపందుకుంది. వృద్ధిమాన్‌ సాహా 4, 6తో వేగాన్ని జత చేశాడు. అక్కడ్నుంచి వరుస బౌండరీలతో టైటాన్స్‌ దూకుడుగా సాగిపోయింది. 9 పరుగుల రన్‌రేట్‌ ప్రత్యర్థి శిబిరంలో గుబులు రేపుతుండగా... ఉమ్రాన్‌ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్‌ 8వ) ఊరటనిచ్చాడు. శుబ్‌మన్‌ గిల్‌ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌)ను బౌల్డ్‌ చేశాడు. అయినా సాహా తన ధాటిని కొనసాగిస్తుండగా మరుసటి ఓవర్లో హార్దిక్‌ పాండ్యా (10)ను ఉమ్రాన్‌ డగౌట్‌కు పంపించేశాడు. సాహా 28 బంతుల్లోనే (8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదేశాడు.

బుల్లెట్‌ వేగంతో విలవిల
సాహా జోరు మీదుండగా, హిట్టర్‌ మిల్లర్‌ జత య్యాడు. అప్పటికీ లక్ష్యం రేసులోనే ఉన్న టైటాన్స్‌ను ఉమ్రాన్‌ మలిక్‌ బుల్లెట్‌ బంతులు కకావికలం చేసింది. 14వ ఓవర్లో సాహా జోరుకు కళ్లెం వేశాడు. 151 కి.మీ.వేగంతో దూసుకొచ్చిన బంతి సాహాను బౌల్డ్‌ చేసింది. తిరిగి 16వ ఓవర్లో మిల్లర్‌ (17), అభినవ్‌ (0) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తెవాటియాకు రషీద్‌ జతవ్వగా... 24 బంతుల్లో 56 పరుగుల సమీకరణం గుజరాత్‌కు క్లిష్టంగా మారింది. ఆఖరి దాకా క్రీజులో ఉన్న ఈ జోడీ అద్భుతాన్నే చేసింది.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) జోసెఫ్‌ 65; విలియమ్సన్‌ (బి) షమీ 5; త్రిపాఠి (ఎల్బీ) (బి) షమీ 16; మార్క్‌రమ్‌ (సి) మిల్లర్‌ (బి) యశ్‌ 56; పూరన్‌ (సి) గిల్‌ (బి) షమీ 3; సుందర్‌ రనౌట్‌ 3; శశాంక్‌ నాటౌట్‌ 25; జాన్సెన్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 195.
వికెట్ల పతనం: 1–26, 2–44, 3–140, 4–147, 5–161, 6–162.
బౌలింగ్‌: షమీ 4–0–39–3, యశ్‌ 4–0–24–1, జోసెఫ్‌ 4–0–35–1, రషీద్‌ 4–0–45–0, ఫెర్గూసన్‌ 4–0–52–0.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) ఉమ్రాన్‌ 68; గిల్‌ (బి) ఉమ్రాన్‌ 22; హార్దిక్‌ (సి) జాన్సెన్‌ (బి) ఉమ్రాన్‌ 10; మిల్లర్‌ (బి) ఉమ్రాన్‌ 17; తెవాటియా నాటౌట్‌ 40; అభినవ్‌ (బి) ఉమ్రాన్‌ 0; రషీద్‌ నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 199.
వికెట్ల పతనం: 1–69, 2–85, 3–122, 4–139, 5–140.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–0, జాన్సెన్‌ 4–0–63–0, నటరాజన్‌ 4–0–43–0, సుందర్‌ 4–0–34–0, ఉమ్రాన్‌ 4–0–25–5.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top