
వన్డేల్లో రోహిత్, కోహ్లి అసాధారణ క్రికెటర్లు
‘క్యాబ్’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా
టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ వ్యాఖ్య
కోల్‌కతా: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వన్డే ఫార్మాట్‌లో కొనసాగించడమే ఉత్తమమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్, కోహ్లి అసాధారణ క్రికెటర్లని... ఫామ్‌లో ఉంటే మరిన్ని రోజులు ఈ ఇద్దరినీ ఆడించాలని ‘దాదా’ సూచించాడు. మీడియాలో రోహిత్, కోహ్లి భవితవ్యంపైనే తరచూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆ్రస్టేలియా పర్యటనతోనే ఇద్దరి అంతర్జాతీయ కెరీర్ ముగుస్తుందనే వార్తలపై స్పందించిన గంగూలీ ‘నాకు వాటి గురించి ఏమాత్రం తెలియదు. కాబట్టి వ్యాఖ్యానించను’ అని అన్నాడు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతను మీడియాతో మాట్లాడుతూ ‘ఇద్దరి ఫామ్‌ను చూడాలి. బాగా ఆడుతుంటే కొనసాగించాలి. వన్డేల్లో కోహ్లిది అసాధారణ రికార్డు. రోహిత్‌ది కూడా! జట్టుకు భారంగా ఏమీ లేరు. బాధ్యతగానే రాణిస్తున్నారు. అలాంటపుడు ఈ ఫార్మాట్‌లో కొనసాగించడంలో తప్పేముంది’ అని అన్నాడు. కోహ్లి, రోహిత్ ఇదివరకే టి20, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
టీమిండియానే ఫేవరెట్...
వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ టి20 టోర్నీలో భారతే ఫేవరెట్ అని గంగూలీ అన్నాడు. ‘టెస్టుల్లో భారత్ ఎంతటి కఠినమైన ప్రత్యర్థో ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో చాటుకుంది. వన్డే, టి20ల్లో కూడా మన జట్టు మేటిగా ఉంది. దుబాయ్ వేదికపై భారత్ తప్పకుండా సత్తా చాటుకుంటుంది. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మంచి నాయకుడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది’ అని ‘దాదా’ చెప్పాడు. సభ్యుల సహకారంతో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష పదవికి మరోసారి పోటీ పడతానని గంగూలీ తెలిపాడు.
2015 నుంచి 2019 వరకు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా కొనసాగిన గంగూలీ... తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగానూ పని చేశాడు. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటివరకు కోహ్లి, రోహిత్ ఆడతారనే స్పష్టత ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా పర్యటనతోనే ఆ ఇద్దరి భవితవ్యం తేలిపోతుందనే చర్చ మీడియాలో జోరందుకుంది.
అక్టోబర్ 19న ఆ్రస్టేలియా టూర్ మొదలవుతుంది. పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదికలపై టీమిండియా మూడు వన్డేలు ఆడుతుంది. అలాగే స్వదేశంలో దక్షిణాఫ్రికాతోనూ మూడు వన్డేల ద్వైపాక్షకి సిరీస్‌లో పాల్గొంటుంది. వచ్చే క్యాలెండర్ ఇయర్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో భారత్‌కు బిజీ షెడ్యూల్ ఉంది.