
స్టార్ పేస్ బౌలర్ సుదీర్ఘ సాధన
లండన్: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు కోసం భారత టాప్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సిద్ధమవుతున్నాడు. రేపటి నుంచి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. పని భారం కారణంగా ఈ సిరీస్‌లో మూడు టెస్టులే ఆడాలని నిర్ణయించుకున్న బుమ్రా బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు తగినంత విరామం తర్వాత పూర్తి ఫిట్‌గా మ్యాచ్‌కు అతను సన్నద్ధమయ్యాడు. టెస్టుకు రెండు రోజుల ముందు మంగళవారం బుమ్రా సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించాడు. విరామం లేకుండా అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఆప్షనల్ ప్రాక్టీస్ రోజు కావడంతో ప్రధాన బ్యాటర్లు గిల్, రాహుల్, జైస్వాల్, పంత్‌తో పాటు సుందర్, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా మంగళవారం సాధన చేయలేదు. దాంతో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్‌లకు బుమ్రా బౌలింగ్ చేశాడు. వీరందరినీ తన బౌలింగ్‌తో బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి రనప్‌తో అతను బౌలింగ్ చేశాడు.
నెట్స్‌కు వచ్చీ రాగానే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను అడిగి తనకు కొత్త బంతి మాత్రమే కావాలని ఎంచుకున్న బుమ్రా దాంతో ప్రాక్టీస్ కొనసాగించాడు. 2021లో లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రివర్స్ స్వింగ్‌తో మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా భారత్ ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సారి లార్డ్స్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అతను ఎలా చెలరేగుతాడనేది ఆసక్తికరం