
గిల్ అజేయ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో 518/5 డిక్లేర్డ్
విండీస్ 140/4
వికెట్ల వేట మొదలుపెట్టిన జడేజా
అనుకున్నట్లే రెండో రోజూ భారత్ జోరు కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో కరీబియన్‌లను కష్టాల్లోకి నెట్టేసింది. మొదట కెప్టెన్ శుబ్‌మన్ గిల్ శతకంతో భారీ స్కోరులో భాగమయ్యాడు. 500 పైచిలుకు స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్... బౌలింగ్‌తోనూ అదరగొట్టింది. రెండో రోజే స్పిన్ తిరగడంతో భారత కెప్టెన్ గిల్... జడేజా, కుల్దీప్‌లతో అనుకున్న ఫలితాలు సాధించాడు.
న్యూఢిల్లీ: ఈ రెండో టెస్టును కూడా ముందే ముగించేందుకు భారత్ సిద్ధమైంది. రెండో రోజు ఆటలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్‌లు కరీబియన్ బౌలర్లపై సులువుగా పరుగులు రాబట్టారు. తర్వాత రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు స్పిన్ ఉచ్చును బిగించారు. తద్వారా క్లీన్‌స్వీప్‌నకు రాచబాట వేశారు.
కెప్టెన్ గిల్ (196 బంతుల్లో 129 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అలిక్ అతనేజ్ (84 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) భారత బౌలర్లను ఎక్కువసేపు ఎదుర్కొన్నాడు. జడేజా 3 వికెట్లు తీశాడు.
జైస్వాల్ రనౌట్
డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం తన క్రితం రోజు స్కోరుకు 2 పరుగులే జతచేసి రనౌటయ్యాడు. దీంతో శనివారం 318/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటకొనసాగించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి గిల్ పరుగుకు ఉపక్రమించి వెనకడుగు వేయడంతో జైస్వాల్ నిష్క్రమించాల్సి వచ్చింది. నిరాశకు లోనైన యశస్వి తలకొట్టుకొని అసహనంగా క్రీజు వీడాడు.
తర్వాత గిల్‌కు జతయిన నితీశ్ వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా పరుగులు సాధించాడు. శుబ్‌మన్ అర్ధసెంచరీని పూర్తిచేసుకోగా... జట్టు స్కోరు తొలిసెషన్‌లోనే 400 పరుగులు దాటింది. క్రీజులో పాతుకుపోయిన నితీశ్‌ను లంచ్ విరామానికి ముందు వారికెన్ అవుట్ చేశాడు. క్రీజులోకి ధ్రువ్ జురేల్ రాగా 427/4 స్కోరు వద్ద తొలిసెషన్ ముగిసింది.
శతక్కొట్టిన సారథి
రెండో సెషన్‌లో పూర్తిగా భారత బ్యాటర్ల జోరే కొనసాగింది. జురేల్ అండతో గిల్ టెస్టుల్లో పదో సెంచరీ సాధించాడు. అడపాదడపా బౌండరీతతో పరుగులు సాధించడంతో భారత్ స్కోరు సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 500 పరుగుల్ని దాటింది. ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించాక జురేల్‌ను చేజ్ అవుట్ చేయడంతోనే గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆదిలోనే క్యాంప్‌బెల్ (10) వికెట్‌ను కోల్పోయినా... చాలాసేపు పోరాడింది.
తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), అతనేజ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరు 87 వద్ద తేజ్‌ను జడేజా అవుట్ చేశాకే భారత్‌కు పట్టు దొరికింది. పరుగు తేడాతో అతనేజ్, చేజ్ (0) వికెట్లను స్పిన్నర్లు పడగొట్టేశారు. షై హోప్ (31 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఇమ్లాచ్ (14 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది.
స్కోరు వివరాలు
భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ రనౌట్ 175; రాహుల్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) వారికెన్ 38; సాయి సుదర్శన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వారికెన్ 87; శుబ్‌మన్ (నాటౌట్) 129; నితీశ్ రెడ్డి (సి) సీల్స్ (బి) వారికెన్ 43; జురేల్ (బి) చేజ్ 44; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (134.2 ఓవర్లలో) 518/5 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–58, 2–251, 3–325, 4–416, 5–518. బౌలింగ్: సీల్స్ 22–2–88–0, ఫిలిప్ 17–2–71–0, గ్రీవెస్ 14–1–58–0, పియర్ 30–2–120–0, వారికెన్ 34–6–98–3, చేజ్ 17.2–0–83–1.
వెస్టిండీస్ తొలిఇన్నింగ్స్: క్యాంప్‌బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 10; తేజ్ (సి) రాహుల్ (బి) జడేజా 34; అతనేజ్ (సి) జడేజా (బి) కుల్దీప్ 41; షై హోప్ (బ్యాటింగ్) 31; చేజ్ (సి) అండ్ (బి) జడేజా 0; ఇమ్లాచ్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 140. వికెట్ల పతనం: 1–21, 2–87, 3–106, 4–107. బౌలింగ్: బుమ్రా 6–3–18–0, సిరాజ్ 4–0–9–0, జడేజా 14–3–37–3, కుల్దీప్ 12–3–45–1, సుందర్ 7–1–23–0.