IND W Vs SA W: మన అమ్మాయిల మహాద్భుతం | Indian Womens Team Wins 52 Runs Over South Africa In ODI World Cup Final, Check Out Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

Women's ODI World Cup 2025 Winner: మన అమ్మాయిల మహాద్భుతం

Nov 3 2025 2:49 AM | Updated on Nov 3 2025 9:04 AM

Indian Womens Team Wins 52 Runs Over South Africa In ODI World Cup Final

మహిళల వన్డే ప్రపంచ కప్‌ విజేత భారత్‌

తొలిసారి టైటిల్‌ సాధించిన టీమిండియా

ఫైనల్లో 52 పరుగులతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం 

సత్తా చాటిన షఫాలీ వర్మ, దీప్తి శర్మ 

మన అతివల ఆట అంబరాన్ని తాకింది... ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం వాటిని అందుకొని అందనంత ఎత్తులో నిలిచింది... గతంలో రెండుసార్లు అందినట్లుగా అంది చేజారిన వన్డే వరల్డ్‌ కప్‌ను ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ముద్దాడింది... ఆఖరి సమరంలో అద్భుత ప్రదర్శనను కనబర్చిన మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా శిఖరానికి చేరారు... ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు... సమష్టిగా చెలరేగిన టీమిండియా ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకుంది. 

ఈ ప్రపంచకప్‌ గెలుపు సాధారణమైంది కాదు. మన మహిళల క్రికెట్‌ను మరింత పెద్ద స్ధాయికి చేర్చే పునాదిరాయి. పురుషుల క్రికెట్‌లో 1983 వరల్డ్‌ కప్‌ గెలుపునకు సమానంగా మన అమ్మాయిల జట్టు రాత మార్చే అరుదైన ఘట్టం. దాదాపు 40 వేల మంది ప్రేక్షకులతో మైదానం నీలి సముద్రంగా మారిపోగా... ఆసక్తిగా సాగిన ఫైనల్లో బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్మృతి మంధాన భారీ స్కోరుకు బాటలు వేసి ప్రత్యర్థికి సవాల్‌ విసరగా... 

బౌలింగ్‌లోనూ దీప్తి, షఫాలీ సత్తా చాటి విజయానికి బాటలు పరిచారు. అభిమానులు అండగా నిలుస్తూ మైదానాన్ని హోరెత్తిస్తుండగా... 46వ ఓవర్‌ మూడో బంతికి డిక్లెర్క్‌ షాట్‌ కొట్టగా, కవర్స్‌లో కెప్టెన్హర్మన్‌ప్రీత్‌ క్యాచ్‌ అందుకొని విజయధ్వానం చేయడం టోర్నీకి లభించిన సరైన ముగింపు.  

ముంబై: భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌ కప్‌ను గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా ఈ టైటిల్‌ సాధించడం ఇదే మొదటిసారి. ఆదివారం డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్‌ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 

షఫాలీ వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించగా...స్మృతి మంధాన (58 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్‌కు 106 బంతుల్లో 104 పరుగులు జోడించారు. 

అనంతరం దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్లారా వోల్‌వార్ట్‌ (98 బంతుల్లో 101; 11 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ (5/39) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, షఫాలీ 2 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మ్యాచ్‌’ పురస్కారం షఫాలీ వర్మకు... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డు దీప్తి శర్మకు లభించాయి.  

భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం... 
టోర్నీలో గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి భారత్‌కు మరింత మెరుగైన ఆరంభం లభించింది. సెమీస్‌లో విఫలమైన షఫాలీ ధాటిగా మొదలు పెట్టగా, స్మృతి కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడింది. కాప్‌ వేసిన మొదటి ఓవర్‌ మెయిడిన్‌గా ముగిసినా... తర్వాత భారత బ్యాటర్లిద్దరూ జోరు ప్రదర్శించారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇద్దరూ చెరో 5 ఫోర్లు బాదగా, స్కోరు 64 పరుగులకు చేరింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు. 

17.2 ఓవర్లలో స్కోరు 100కు చేరగా, ఆ తర్వాత ట్రయాన్‌ తొలి ఓవర్లోనే స్మృతిని అవుట్‌ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం షఫాలీ మరింత వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే సెంచరీకి చేరువవుతున్న దశలో అలసటతో ఇబ్బంది పడిన ఆమె వికెట్‌ సమర్పించుకుంది. జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 24; 1 ఫోర్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) విఫలమయ్యారు. 

ముఖ్యంగా ఎంలాబా చక్కటి బంతితో హర్మన్‌ను బౌల్డ్‌ చేయడంతో సఫారీలకు పైచేయి సాధించే అవకాశం దక్కింది. దీప్తి భారీ షాట్లకంటే సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టగా, అమన్‌జోత్‌ (14 బంతుల్లో 12; 1 ఫోర్‌) విఫలమైంది. అయితే రిచా ఘోష్‌ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో దూకుడుగా ఆడటంతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. 

కెప్టెన్ మినహా..  
ఛేదనను వోల్‌వార్ట్, బ్రిట్స్‌ (35 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ప్రారంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 52 పరుగులు చేసింది. అయితే 10వ ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించిన బ్రిట్స్‌ను అమన్‌జోత్‌ డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేయడంతో జట్టు వికెట్ల పతనం మొదలైంది. అనెక్‌ బాష్‌ను (0) తన తొలి ఓవర్లోనే అవుట్‌ చేసి శ్రీచరణి మళ్లీ దెబ్బ తీసింది.  

21వ ఓవర్లో పార్ట్‌టైమర్‌ షఫాలీని బౌలింగ్‌కు దించడం భారత్‌కు కలిసొచ్చింది. 9 పరుగుల వ్యవధిలో లూస్‌ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు), కాప్‌ (4)లను షఫాలీ అవుట్‌ చేసింది. ఒకవైపు వోల్‌వార్ట్‌ పోరాడుతున్నా...మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. డెర్క్‌సెన్‌ (37 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్ది సేపు సహకరించినా లాభం లేకపోయింది. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వోల్‌వార్ట్‌ వెనుదిరగడంతో సఫారీ ఓటమి లాంఛనమే అయింది.  

మన చరణి బంగారం... 
ప్రపంచకప్‌కు ముందు 9 వన్డేలు ఆడి ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోగలిగింది. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటింది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల చరణి తన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌తో ప్రత్యర్థులందరినీ కట్టి పడేసింది. తొలి సారి ఆడిన ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలిగా ఘనతను సొంతం చేసుకుంది. 

ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లలో 27.64 సగటుతో ఆమె 14 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఐదుకంటే తక్కువ ఎకానమీ (4.96)తో ఆమె పరుగులు ఇచ్చింది. హైదరాబాద్‌కే చెందిన అరుంధతి రెడ్డి కూడా భారత విశ్వవిజేత జట్టులో సభ్యురాలిగా ఉంది.  

షఫాలీ సూపర్‌....  
‘నన్ను దేవుడు ఒక ప్రత్యేక పని కోసమే ఇక్కడికి పంపించినట్లున్నాడు’... ఫైనల్‌ తర్వాత షఫాలీ వర్మ వ్యాఖ్య ఇది. నిజంగానే అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టంతో జట్టులోకి వచ్చిన ఆమె తాను అరుదైన ఘనతను నమోదు చేసి చూపించింది. ప్రతీక రావల్‌తో హడావిడిగా షఫాలీని సెమీస్‌కు ముందు టీమ్‌లోకి చేర్చారు. సెమీస్‌లో విఫలమైనా... ఫైనల్లో చెలరేగి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచి షఫాలీ తానేమిటో ప్రపంచానికి చూపించింది. 

బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లో కూడా 2 కీలక వికెట్లు ఆమె ఫైనల్‌ ఫలితాన్ని శాసించింది. గతంలో అండర్‌–19 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యురాలైన షఫాలీ ఇప్పుడు సీనియర్‌ ప్రపంచకప్‌లోనూ భాగమైంది. వికెట్‌  కీపర్‌ రిచా ఘోష్‌కు కూడా అండర్‌–19 తర్వాత ఇది రెండో ప్రపంచ కప్‌ విజయం కావడం విశేషం.  

ఆ ముగ్గురు... 
2017లో ఇంగ్లండ్‌ చేతిలో ఫైనల్లో అనూహ్య ఓటమి భారత ఆటగాళ్లకు వేదనను మిగిల్చింది. నాటి జట్టులో సభ్యులైన హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఇప్పుడు ఎట్టకేలకు విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ ముగ్గురూ తమదైన ప్రత్యేకతలతో ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నారు. హర్మన్‌ కెపె్టన్‌గా చరిత్రను సృష్టించగా...స్మృతి టాప్‌ స్కోరర్‌గా, దీప్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం వారి ఆటకు ఘనమైన గుర్తింపు అనడంలో సందేహం లేదు.  

4 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగో జట్టుగా భారత్‌ నిలిచింది. ఆస్ట్రేలియా ఏడుసార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022), ఇంగ్లండ్‌ నాలుగుసార్లు (1973, 1993, 2009, 2017), న్యూజిలాండ్‌ (2000), భారత్‌ (2025) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.

4 ఆతిథ్య దేశం హోదాలో వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచిన నాలుగో జట్టు భారత్‌. గతంలో ఇంగ్లండ్‌ (1973, 1993, 2017), ఆ్రస్టేలియా (1988), న్యూజిలాండ్‌ (2000) ఈ ఘనత సాధించాయి.

571 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా కెపె్టన్‌ వోల్‌వార్ట్‌ నిలిచింది. ఆ్రస్టేలియా కెపె్టన్‌ అలీసా హీలీ (2022లో 509 పరుగులు) పేరిట ఉన్న రికార్డును వోల్‌వార్ట్‌ బద్దలు కొట్టింది.

22 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా దీప్తి శర్మ (9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) గుర్తింపు పొందింది. నీతూ డేవిడ్‌ (2005లో 20 వికెట్లు), శుభాంగి కులకర్ణి (1982లో 20 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి శర్మ సవరించింది. 

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి (సి) జాఫ్తా (బి) ట్రయాన్‌ 45; షఫాలీ (సి) లూస్‌ (బి) ఖాకా 87; జెమీమా (సి) వోల్‌వార్ట్‌ (బి) ఖాకా 24; హర్మన్‌ప్రీత్‌ (బి) ఎంలాబా 20; దీప్తి శర్మ (రనౌట్‌) 58; అమన్‌జోత్‌ (సి అండ్‌ బి) డిక్లెర్క్‌ 12; రిచా (సి) డెర్క్‌సెన్‌ (బి) ఖాకా 34; రాధ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298. వికెట్ల పతనం: 1–104, 2–166, 3–171, 4–223, 5–245, 6–292, 7–298. బౌలింగ్‌: కాప్‌ 10–1–59–0, ఖాకా 9–0–58–3, ఎంలాబా 10–0–47–1, డిక్లెర్క్‌ 9–0–52–1, లూస్‌ 5–0–34–0, ట్రయాన్‌ 7–0–46–1.  

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: వోల్‌వార్ట్‌ (సి) అమన్‌జోత్‌ (బి) దీప్తి 101; బ్రిట్స్‌ (రనౌట్‌) 23; బాష్‌ (ఎల్బీ) (బి) శ్రీచరణి 0; లూస్‌ (సి అండ్‌ బి) షఫాలీ 25; కాప్‌ (సి) రిచా (బి) 4; జాఫ్తా (సి) రాధ (బి) దీప్తి 16; డెర్క్‌సెన్‌ (బి) దీప్తి 35; ట్రయాన్‌ (ఎల్బీ) (బి) దీప్తి 9; డిక్లెర్క్‌ (సి) హర్మన్‌ (బి) దీప్తి 18; ఖాకా (రనౌట్‌) 1; ఎంలాబా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్‌) 246. వికెట్ల పతనం: 1–51, 2–62, 3–114, 4–123, 5–148, 6–209, 7–220, 8–221, 9–246, 10–246. బౌలింగ్‌: రేణుక 8–0–28–0, క్రాంతి 3–0–16–0, అమన్‌జోత్‌ 4–0–34–0, దీప్తి 9.3–0–39–5, శ్రీచరణి 9–0–48–1, రాధ 5–0–45–0, షఫాలీ 7–0–36–2. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement