
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 16) సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (41), సోఫీ ఎక్లెస్టోన్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్యామీ బేమౌంట్ (5), ఆమీ జోన్స్ (1) నిరాశపరిచారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్‌జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్‌ను గెలిపించింది. దీప్తి.. అమన్‌జోత్ (20 నాటౌట్) సహకారంతో టీమిండియాను విజయతీరాలకు (48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి) చేర్చింది.
చివర్లో జెమీమా, రిచా ఘోష్ (10) స్వల్ప వ్యవధిలో (15 పరుగులు) ఔటైనప్పుడు కాస్త ఒత్తిడికి గురైన భారత శిబిరం.. దీప్తి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చూసి గెలుపు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ (10-1-34-1) ఒక్కరే భారత బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టింది. మిగతా బౌలర్లనంతా భారత బ్యాటర్లు సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. ఛార్లోట్ డీన్ 2, లారెన్ ఫైలర్, లారెన్ బెల్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జులై 19న జరుగనుంది.
