
ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యిపై గెలుపు
క్వార్టర్ ఫైనల్లోకి భారత స్టార్ షట్లర్
డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
పారిస్: సత్తాకు సవాల్‌గా నిలిచిన మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ప్రతాపాన్ని చూపించింది. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా సాధికారిక ఆటతీరుతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 21–19, 21–15తో గెలిచింది. 48 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు రెండు గేముల్లోనూ నిలకడగా ఆడింది.
గతంలో వాంగ్ జి యిపై రెండుసార్లు గెలిచి, రెండుసార్లు ఓడిపోయిన సింధు ఐదో ప్రయత్నంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో 6–2తో ముందంజ వేసిన సింధు... ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకుంది. ఈ దశలో వాంగ్ జి యి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 12–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వాంగ్ జి యి 19–17తో తొలి గేమ్ సొంతం చేసుకునేందుకు రెండు పాయింట్ల దూరంలో నిలిచింది.
అయితే సింధు ఆందోళన చెందకుండా, తన అనుభవాన్నంత రంగరించి ఆడి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 21–19తో దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. స్కోరు 6–6 వద్ద సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11–6తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అనంతరం వాంగ్ జి యి తేరుకొని ఆధిక్యం అంతరం ఒక పాయింట్‌కు తగ్గించింది. స్కోరు 12–11 వద్ద సింధు మళ్లీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 16–11తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు విజయాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)తో సింధు ఆడుతుంది.
పురుషుల డబుల్స్ విభాగంలో
సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ సాత్విక్–చిరాగ్ ద్వయం 19–21, 21–15, 21–17తో ప్రపంచ ఆరో ర్యాంక్ లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జోడీని బోల్తా కొట్టించింది.
మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీ కూడా సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐదో ర్యాంక్ జంట టాంగ్ చున్ మాన్–సెయింగ్ సుయెట్ (హాంకాంగ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ధ్రువ్–తనీషా జోడీ 19–21, 21–12, 21–15తో గెలిచింది.
ప్రణయ్‌కు నిరాశ
పురుషుల సింగిల్స్ విభాగంలో 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, భారత స్టార్ ప్రణయ్ పోరాటం ముగిసింది. రెండో రౌండ్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 8–21, 21–17, 21–23తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ప్రణయ్ మూడు మ్యాచ్ పాయింట్లు చేజార్చుకోవడం గమనార్హం.