నేడు రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ‘ఢీ’
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
నవీ ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగిన టీమిండియా... నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు సెమీఫైనల్ ఆడిన టీమిండియా అందులో రెండుసార్లు గెలిచి ఫైనల్లో పరాజయం పాలైంది.
చివరిసారిగా 2017లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విజయం సాధించిన టీమిండియా... ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియాకు గట్టి పోటీనిస్తున్న హర్మన్‌ప్రీత్ బృందం ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా సత్తా చాటి తొలి టైటిల్ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది.
స్మృతి, హర్మన్‌లపైనే భారం
2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత ఆ్రస్టేలియా జట్టుకు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వలేదు. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసినా ... బౌలర్లు విఫలమవడంతో దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆసీస్‌తో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన వరుసగా 105, 58, 117, 125, 80 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు కూడా ఆసీస్‌పై మంచి రికార్డే ఉంది. వీరిద్దరూ చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. గాయం కారణంగా మరో ఓపెనర్ ప్రతీకా రావల్ వరల్డ్‌కప్‌నకు దూరం కావడంతో ఈ మ్యాచ్‌లో స్మృతితో కలిసి షఫాలీ వర్మ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. హర్లీన్æ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక, శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కీలకం కానున్నారు.
మరోవైపు అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లే గార్డ్‌నర్‌లతో ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మేగన్ షుట్, అలానా కింగ్ బౌలింగ్ భారం మోయనున్నారు. సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వరుణుడి కారణంగా మ్యాచ్ సాగకపోతే శుక్రవారం ‘రిజర్వ్ డే’ ఉంది. అందులోనూ ఆట సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టు (ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుతుంది.
11
భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు జరిగాయి. 11 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచి, 49 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 14 సార్లు తలపడ్డాయి. 3 సార్లు భారత్ గెలిచి, 11 సార్లు పరాజయం పాలైంది.


