టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్‌తో ఆడిన 32 మ్యాచ్‌ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది.
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్‌లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.
తొలి పంజా మనదే
భారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్‌పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్‌లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.
అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్‌బోర్న్‌లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్‌లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
గంభీర్ మరోసారి..!
2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు.
యువీ విధ్వంసం
2013 అక్టోబర్‌లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.
చెలరేగిన కోహ్లి.. వైట్‌వాష్
మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.
రాణించిన శిఖర్
అనంతరం 2017 అక్టోబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ (భారత్), 2018 నవంబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.
తొలి పరాభవం
2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.
హ్యాట్రిక్ విక్టరీస్
ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్‌లో), 2023 (భారత్‌లో) సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్‌లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్‌లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.
యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం
2023లో జరిగిన సిరీస్‌లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్‌ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.
చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..!


