టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli) ఏడు నెలల విరామం తర్వాత తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే వీరి ఏకైక లక్ష్యం. ఇందులో భాగంగానే వారు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
రోకో తదుపరి టార్గెట్ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే సిరీస్. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు జరుగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా ఈ వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి చెలరేగే అవకాశం ఉంది. స్వదేశంలో జరిగే వన్డేల్లో ఈ ఇద్దరికి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ప్రత్యర్ధి ఎవరైనా స్వదేశంలో రోకోను ఆపడం అసాధ్యం.
రో'హిట్టు'
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ సూపర్ హిట్టయ్యాడు. 3 మ్యాచ్‌ల్లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 202 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినప్పటికీ రోహిత్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి వన్డేలో రోహిత్ చేసిన సెంచరీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.
భారీగా బరువు తగ్గి ఫిట్‌నెస్ మెరుగుపర్చుకున్న రోహిత్ ఆ మ్యాచ్‌లో యధేచ్చగా షాట్లు ఆడాడు. మునుపటి రోహిత్‌ను గుర్తు చేశాడు. రెండో వన్డేలోనూ రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టమైన పిచ్‌పై శైలికి విరుద్దంగా, చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
ఈ రెండు ఇన్నింగ్స్‌ల తర్వాత రోహిత్ భవితవ్యంపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం 38 ఏళ్ల వయసున్న రోహిత్ 2027 ప్రపంచకప్ సమయానికి 40వ పడిలో ఉంటాడు.
ఆ వయసులో అతనెలా ఆడగలడని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ అనుమానాలకు రోహిత్ తన ప్రదర్శనలతో చెక్ పెట్టేశాడు. ఫిట్‌నెస్ ఇలాగే కాపాడుకుంటే 40 కాదు మరో ఐదేళ్లైనా ఆడగలనన్న సంకేతాలు పంపాడు. మొత్తంగా ఆస్ట్రేలియా సిరీస్‌లో హిట్టైన రోహిత్ 2027 ప్రపంచకప్‌కు సిద్దమంటూ సంకేతాలు పంపాడు.
పరువు కాపాడుకున్న కోహ్లి
ఆసీస్ సిరీస్‌లో రోహిత్ హిట్టైతే.. అతని సహచరుడు కోహ్లి మాత్రం నాట్ బ్యాడ్ అనిపించాడు. తొలి రెండు వన్డేల్లో డకౌటైనా, మూడో వన్డేలో రోహిత్‌తో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (74 నాటౌట్) ఆడి పరువు కాపాడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లి భవితవ్యంపై కూడా అనుమానాలు తొలగిపోయాయి.
కోహ్లి సైతం 2027 ప్రపంచకప్‌కు రెడీ అంటూ సంకేతాలు పంపాడు. ఫిట్‌నెస్ పరంగా ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండే కోహ్లి.. ఫామ్‌ను కాపాడుకుంటే ఈజీగా మరో నాలుగైదేళ్లు ఆడగలడు. మొత్తానికి ఈ సిరీస్‌తో రోహిత్, కోహ్లి భవితవ్యంపై అనుమానాలకు తెరపడింది. ప్రపంచకప్ వరకు వారు ఈజీగా కొనసాగగలరు.
ఈ మధ్యలో వారు ఆడే అవకాశమున్న మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం..
- స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం వచ్చే ఏడాది స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది.
- దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారత్‌లో పర్యటించి వన్డేలు ఆడనుంది.
- అనంతరం ఇంగ్లండ్, బంగ్లాదేశ్ పర్యటనల్లో భారత్ వన్డే సిరీస్‌లు ఆడుతుంది.
- ఆతర్వాత వెస్టిండీస్ భారత్‌లో పర్యటించి వన్డేలు ఆడనుంది.
- అతర్వాత భారత్ న్యూజిలాండ్లో పర్యటించి వన్డేలు ఆడుతుంది.
- 2027 వన్డే ప్రపంచకప్‌కు కొద్దిముందు భారత్ స్వదేశంలో శ్రీలంకతో వన్డేలు ఆడనుంది.
ఈ సిరీస్‌ల్లో రోకో అన్ని ఆడతారని చెప్పలేము కాని, మెజార్జీ శాతం సిరీస్‌ల్లో పాల్గొనే అవకాశం ఉంది.
చదవండి: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్


