
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక స్పెషలిస్టు పేసర్‌తో బరిలోకి దిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్‌లో పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సేవలు వినియోగించుకుంది.
ఇక ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), శివం దూబేలను పార్ట్‌టైమ్ సీమ్ బౌలర్లుగా వాడుకుంది. మరోవైపు.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిని ఆడించింది. వీరికి తోడుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కూడా బరిలోకి దించింది.
అర్ష్‌దీప్‌నకు మొండిచేయి
ఓవరాల్‌గా బౌలింగ్ విభాగంలో బుమ్రా, కుల్దీప్, వరుణ్ సేవలను ఉపయోగించుకున్న యాజమాన్యం.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టింది. నిజానికి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నది అర్ష్‌దీప్. ఇప్పటి వరకు ఈ లెఫ్టార్మ్ పేసర్ 63 మ్యాచ్‌లలో కలిపి 99 వికెట్లు కూల్చాడు.
యూఏఈతో మ్యాచ్‌లో ఇలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘కెప్టెన్, హెడ్‌కోచ్‌తో చర్చ తర్వాతే తుదిజట్టు కూర్పుపై స్పష్టత వస్తుంది.
అందుకే అతడిని ఆడించలేదు
జట్టులోని 15 మంది ఇందుకు అర్హులే. కానీ పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయి. ఒక ఆటగాడికి తుదిజట్టులో చోటు దక్కనపుడు అతడు నిరాశకు గురికావడం సహజం. అయితే, ఇదొక టీమ్ స్పోర్ట్. ఎజెండా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇందులో వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలకు తావు ఉండదు.
ఆరోజు అత్యుత్తమ జట్టు ఏది అనిపిస్తుందో.. కెప్టెన్, హెడ్‌కోచ్ దానినే ఎంపిక చేసుకుంటారు. ఆడే అవకాశం రాని వాళ్లు కూడా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ప్లేయర్లకు సహకారం అందిస్తారు’’ అని సితాన్షు కొటక్ స్పష్టం చేశాడు.
సంజూ సంతోషంగా ఉన్నాడు
అదే విధంగా.. చాన్నాళ్లుగా టీమిండియా టీ20 ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను మిడిలార్డర్‌కు పంపడంపై కూడా సితాన్షు కొటక్ స్పందించాడు. ‘‘బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదు లేదంటే ఆరో స్థానంలో సంజూ ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. దీనర్థం అతడు ఆ స్థానంలో ఆడలేడని కాదు.
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ముందుగా చెప్పినట్లు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే హెడ్‌కోచ్, కెప్టెన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంజూ కూడా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు సంతోషంగా ఉన్నాడు’’ అని కొటక్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ తదుపరి సెప్టెంబరు 14న దాయాది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇందుకు దుబాయ్ వేదిక.
చదవండి: పాక్‌ను ఓడించడానికి వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!