
హిసర్ (తజికిస్తాన్): అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించుకుంది. సీఏఎఫ్‌ఏ నేషన్స్ కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో గురువారం భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయ్యింది. ‘ఫిఫా’ ర్యాంకుల్లో 127వ స్థానంలో ఉన్న భారత్ తమకన్నా దిగువ ర్యాంకు 160లో ఉన్న అఫ్గానిస్తాన్‌పై ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలోనూ విఫలమైంది.
ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై చేసిన దాడుల్లోనూ నిరాశపరిచింది. అఫ్గానిస్తాన్ మూడుసార్లు భారత్ గోల్‌పోస్ట్‌పై గురిపెడితే... భారత్ కేవలం రెండుసార్లే గోల్ ప్రయత్నాలు చేయగలిగింది. భారత్ కన్నా అఫ్గానిస్తాన్ రక్షణ శ్రేణి మెరుగ్గా ఆడింది. తాజా ఫలితంలో భారత్ గ్రూప్ ‘బి’లో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని కోల్పోయిన భారత్ ఇప్పుడు మూడు, నాలుగో స్థానాల కోసం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ నెల 8న ఈ కాంస్య పతకపోరు జరుగుతుంది.