సంజూకు మరోసారి మొండిచెయ్యి.. రెండో వన్డే జట్టునే కొనసాగించిన టీమిండియా

IND VS NZ 3rd ODI: Sanju Samson Not In Playing Eleven - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య   ఇవాళ (నవంబర్‌ 30) జరుగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వెట్‌ ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా టాస్‌ ఆలస్యంగా వేశారు. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు మరోసారి వివాదాస్పదంగా మారింది. మేనేజ్‌మెంట్‌ మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచెయ్యి చూపి బెంచ్‌కే పరిమితం చేసింది. రెండో వన్డేలో ఎంపిక చేసిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ యధాతథంగా కొనసాగించింది. శాంసన్‌ను మరోసారి తుది జట్టులో ఎంపిక చేయకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌తో శాంసన్‌ విషయంలో టీమిండియా యాజమాన్యం వైఖరి స్పష్టమైందని, శాంసన్‌.. ఉన్ముక్త్‌ చంద్‌లా మరో దేశానికి వలస వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. 

మరోవైపు న్యూజిలాండ్‌ రెండో వన్డేకు ఎంపిక చేసిన తుది జట్టులో ఓ మార్పు చేసింది. మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ స్థానంలో ఆడమ్‌ మిల్నే తుది జట్టులోకి వచ్చాడు. 3 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 7 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించగా, వర్షం కారణంగా రెండో వన్డే రద్దైంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. 

భారత తుది జట్టు..
శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, దీపక్‌ హూడా, వాషిం‍గ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌, చహల్‌

న్యూజిలాండ్‌ తుది జట్టు.. 
ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), డారిల్‌ మిచెల్‌, టామ్‌ లాథమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఆడమ్‌ మిల్నే, మ్యాట్‌ హెన్రీ, టిమ్‌ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top