IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్‌స్టాస్‌, ఫిలిప్‌.. ఆసీస్‌ భారీ స్కోరు | IND A vs AUS A Konstas And Philippe Centuries Aus Declares At 532 | Sakshi
Sakshi News home page

IND vs AUS: శతకాలతో చెలరేగిన కొన్‌స్టాస్‌, ఫిలిప్‌.. ఆసీస్‌ భారీ స్కోరు

Sep 17 2025 12:12 PM | Updated on Sep 17 2025 12:24 PM

IND A vs AUS A Konstas And Philippe Centuries Aus Declares At 532

భారత్‌-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. 

సెంచరీతో కదంతొక్కిన కొన్‌స్టాస్‌
టీమిండియాపై టెస్టు అరంగేట్రం చేసిన సామ్‌ కొన్‌స్టాస్‌ (Sam Konstas) సెంచరీతో కదంతొక్కగా... క్యాంప్‌బెల్‌ కెల్లావే (Campbell Kellaway- 97 బంతుల్లో 88; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూపర్‌ కనొల్లీ (84 బంతుల్లో 70; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

తొలి వికెట్‌కు 198 పరుగులు జోడించిన అనంతరం క్యాంపెబల్‌ అవుట్‌ కాగా.. ఈ దశలో భారత బౌలర్లు కాస్త పోరాటం కనబర్చారు. కెప్టెన్‌ నాథన్‌ మెక్‌స్వీనీ (1), ఒలీవర్‌ పీక్‌ (2)ను వెంట వెంటనే ఔట్‌ చేశారు. 

దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 198/0 నుంచి 224/4కు చేరింది. ఇక పట్టు చేజిక్కించుకోవడమే తరువాయి అనుకుంటుంటే... కూపర్‌ కనొల్లీ, లియామ్‌ స్కాట్‌ (79 బంతుల్లో 47 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పట్టుదల కనబర్చారు.

దూబే... ఒక్కడే 
ఈ జంట ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించింది. ప్రసిధ్‌ కృష్ణ (0/47), ఖలీల్‌ అహ్మద్‌ (1/46) పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో... ఆసీస్‌ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. భారత బౌలర్లలో హర్ష్‌ దూబే 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన దూబే... ఒక్కడే ఆసీస్‌ ప్లేయర్లను ఇబ్బంది పెట్టగలిగాడు. గుర్‌నూర్‌ బ్రార్‌ ఒక వికెట్‌ తీశాడు.

జోష్‌ ఫిలిప్‌ అజేయ సెంచరీ
ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. లియామ్‌ స్కాట్‌తో పాటు జోష్‌ ఫిలిప్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా తొలి రోజు 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా లియామ్‌ స్కాట్‌ (81) అదరగొట్టగా.. వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ అజేయ సెంచరీ (123)తో దుమ్ములేపాడు. మరోవైపు.. టెయిలెండర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల భారీ స్కోరు వద్ద ఆసీస్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత బౌలర్లలో హర్ష్‌ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్‌ బ్రార్‌ రెండు, ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక బుధవారం భోజన విరామ సమయానికి భారత్‌-‘ఎ’ జట్టు మూడు ఓవర్లలో మూడు పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ 2, నారాయణ్‌ జగదీశన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో..
ఒకవైపు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌లో పాల్గొంటుండగా... మరోవైపు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా- ‘ఎ’తో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నారు. ఈ జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... సాయి సుదర్శన్, దేవదత్‌ పడిక్కల్, ధ్రువ్‌ జురెల్, ప్రసిద్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్‌ వంటి వాళ్లు బరిలో ఉన్నారు. 

చదవండి: IND Vs WI: టీమిండియాతో టెస్టులకు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement