Ind Vs Aus 4th Test: ఖవాజా అజేయ సెంచరీ.. గ్రీన్‌ విశ్వరూపం! షమీ తన వంతుగా..

Ind Vs Aus 4th Test Day 1: Khawaja Unbeaten 104 Guide Aus Upper Hand - Sakshi

Ind Vs Aus 4th Test Day 1 Highlights: టీమిండియాతో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఉస్మాన్‌ ఖవాజా అజేయ సెంచరీతో రోహిత్‌ సేనపై పైచేయి సాధించింది. అహ్మదాబాద్‌లో గురువారం(మార్చి 9) నాటి ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టుల్లో టీమిండియా, ఇండోర్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక నాలుగో టెస్టు గురువారం మొదలైంది.

మ్యాచ్‌ వీక్షించిన ప్రధానులు
ఈ క్రమంలో భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌.. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి స్టేడియానికి విచ్చేశారు. ఆటగాళ్లను పలకరించిన ప్రధానులు వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

అశ్విన్‌కు తొలి వికెట్‌
పేసర్‌ మహ్మద్‌ షమీతో బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. అయితే, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 15.3ఓవర్లో మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(32)ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ అందించాడు.

ఆ తర్వాత 22.2 ఓవర్లో షమీ మార్నస్‌ లబుషేన్‌(3)ను బౌల్డ్‌ చేసి రెండో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత పట్టుదలగా నిలబడిన ఖవాజా, స్మిత్‌ జోడీని విడదీసేందుకు టీమిండియా విశ్వప్రయత్నం చేసింది.

జడ్డూ బ్రేక్‌ ఇచ్చాడు
సుదీర్ఘ విరామం తర్వాత 63.4 ఓవర్లో రవీంద్ర జడేజా స్మిత్‌ను అవుట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత షమీ పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ను పెవిలియన్‌కు పంపి నాలుగో వికెట్‌ అందించాడు. కానీ.. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఖవాజా.. సెంచరీ సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

ఖవాజా, గ్రీన్‌ అద్భుత బ్యాటింగ్‌
మొదటి రోజు ఆటలో అతడు మొత్తంగా 251 బంతులు ఎదుర్కొని 15 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ తర్వాత శతకం సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ అతడికి సహకారం అందించాడు.

ఆట ముగిసే సరికి 64 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి అర్ధ శతకానికి పరుగు దూరంలో నిలిచాడు. ఖవాజా, గ్రీన్‌ అద్భుత బ్యాటింగ్‌తో మొత్తానికి తొలి రోజు ఆస్ట్రేలియా టీమిండియాపై ఆధిపత్యం చెలాయించగలిగింది. అశూ, జడ్డూ ఒక్కో వికెట్‌ తీయగా.. షమీకి రెండు వికెట్లు దక్కాయి. 

చదవండి: Steve Smith: అంతా బాగానే ఉంది కానీ.. ఇదేంటి స్మిత్‌! మరీ ఇలా.. కెరీర్‌లో ఇదే తొలిసారి!
Pritvi Shaw: ఆసక్తికర పోస్ట్‌.. పృథ్వీ షా ఎవరిని టార్గెట్‌ చేశాడు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top