శతక్కొట్టిన రోహిత్‌... కోహ్లి హాఫ్‌ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌ | IND vs AUS 3rd ODI: Rohit Century Kohli Fifty India Beat Aus 9 Wickets | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన రోహిత్‌... కోహ్లి హాఫ్‌ సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

Oct 25 2025 3:41 PM | Updated on Oct 25 2025 4:10 PM

IND vs AUS 3rd ODI: Rohit Century Kohli Fifty India Beat Aus 9 Wickets

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా (India Beat Australia) ఘన విజయం సాధించింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆతిథ్య జట్టును ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శనలతో రాణించి జట్టుకు విజయం అందించారు. రోహిత్‌ సెంచరీతో చెలరేగగా.. కోహ్లి హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌, అడిలైడ్‌ వన్డేల్లో ఓడిన టీమిండియా.. సిడ్నీ వేదికగా శనివారం మూడో వన్డే ఆడింది. ఇందులో టాస్‌ గెలిచిన ఆసీస్‌ సారథి మిచెల్‌ మార్ష్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

236 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌ 
ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి ఆసీస్‌ 46.4 ఓవర్లలో 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (41), ట్రావిస్‌ హెడ్‌ (25 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. మాథ్యూ షార్ట్‌ (30), అలెక్స్‌ క్యారీ (24), కూపర్‌ కన్నోలి (23) ఓ మోస్తరుగా బ్యాటింగ్‌ చేశారు.

తొలి ఫోర్‌ వికెట్‌ హాల్‌
అయితే, నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా తన కెరీర్‌లో తొలి వన్డే హాఫ్‌ సెంచరీ (56)తో సత్తా చాటాడు. తద్వారా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో పేసర్‌ హర్షిత్‌ రాణా నాలుగు వికెట్లు పడగొట్టి.. తన కెరీర్‌లో తొలి ఫోర్‌ వికెట్‌ హాల్‌ నమోదు చేశాడు.

మిగిలిన వారిలో పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ చెరో వికెట్‌ తీయగా.. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్‌, విరాట్‌ ధనాధన్‌
ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (26 బంతుల్లో 24) త్వరగానే పెవిలియన్‌ చేరాడు. ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్‌ 105 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు,  మూడు సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు.

 

కాగా రోహిత్‌ వన్డే కెరీర్‌లో ఇది 33వ శతకం కావడం విశేషం. మరోవైపు.. పెర్త్‌, అడిలైడ్‌ వన్డేల్లో డకౌట్‌ అయిన కోహ్లి.. ఈసారి మాత్రం తనదైన ముద్ర వేయడంలో సఫలం అయ్యాడు. వన్డే కెరీర్‌లో 75వ హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఫోర్‌ బాది రోహిత్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో సత్తా చాటిన రోహిత్‌ శర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డుతో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పెర్త్‌లో ఎనిమిది పరుగులే చేసిన రోహిత్‌.. అడిలైడ్‌లో మాత్రం 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా సెంచరీతో చెలరేగి మరోసారి తన విలువను చాటుకున్నాడు. ఏదేమైనా సిడ్నీ వన్డేతో తాము వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని రో- కో చెప్పారంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

చదవండి: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సచిన్‌ తర్వాత స్థానం ‘కింగ్‌’దే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement