ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆసీస్ దేశవాళీ డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ అనంతరం ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు మార్ష్ తెలిపాడు.
డొమాస్టిక్ క్రికెట్‌లో మార్ష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి జాతీయ జట్టు తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు మాత్రం సిద్దంగా ఉన్నానని మిచెల్ స్పష్టం చేశాడు.
"ప్రతిష్టాత్మక షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. పెర్త్ స్కార్చర్స్, వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో నా ప్రయాణం ఒక అద్భుతం. భవిష్యత్తులో కూడా డబ్ల్యూఏ కోసం ఏమి చేయడానికైనా సిద్దమని" ఓ ప్రకటనలో మార్ష్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌కు మార్ష్ నాయకత్వం వహిస్తున్నాడు. పెర్త్ స్కార్చర్స్ యాజమాన్యంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ కూడా భాగంగా ఉంది.
"వైట్‌బాల్ క్రికెట్‌లో తనను నిరూపించుకున్న మార్ష్.. టెస్టుల్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. దాదాపు నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న 2023 యాషెస్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తన పునరాగమన మ్యాచ్‌లో సెంచరీ చేసి దుమ్ములేపాడు.
ఆ తర్వాత అతడు తన ఫామ్‌ను కోల్పోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మార్ష్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసింది. అతడు చివరగా గతేడాది డిసెంబర్‌లో భారత్‌పై చివరగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. షెఫీల్డ్ షీల్డ్‌లో మార్ష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 2744 పరుగులతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు
చదవండి: Ashes Test series: ఆస్ట్రేలియాకు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్


